కరోనా 2.0: వ్యాక్సిన్‌ రక్షించునా?!

Is Vaccine Protect Us From Coronavirus New Strain - Sakshi

బ్రిటన్‌ తదితర దేశాల నుంచి మరోసారి కరోనా పులి పంజా విప్పింది. ఈ సారి మరో సరికొత్త రూపంతో ప్రపంచం మీద ప్రతాపం చూపిస్తోంది. ఆప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్‌ బాట పట్టాయి. మన దేశంలోనూ కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్తగా ఆంక్షలు విధిస్తున్నారు. మరోవైపు ప్రజల్లో కూడా ఏం జరుగుతోంది? ఏం జరుగబోతోంది? అనే ఆందోళన నెలకొంది. ఈ నేపధ్యంలో వేల సంఖ్యలో ప్రజలు సామూహికంగా జరుపుకునే నూతన సంవత్సర వేడుకలు, పండుగలూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే నగరానికి చెందిన మణిపాల్‌ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ శ్రీధర్‌ అందిస్తున్న అభిప్రాయాల, సూచనల సమాహారమే ఈ కథనం.. –సాక్షి, సిటీబ్యూరో

గత ఏడాది డిసెంబరు నెలలో చైనాలో కరోనా వైరస్‌ స్టార్ట్‌ అయినప్పుడు మనం పట్టించుకోనేలేదు. అది మన వరకూ రాదనుకున్నాం. అదే ధీమాతో జనవరి, ఫిబ్రవరి వరకూ గడిపేశాం. చివరికి ఏమైంది.. మార్చిలో లాక్‌డౌన్‌‌ పెట్టాల్సి వచ్చింది. మరి అదే విధంగా ఈ సారి కూడా డిసెంబరు నెలలో మరో కొత్త స్ట్రెయిన్‌ని కనిపెట్టారు. మరి ఇప్పుడూ అదే పరిస్థితి వస్తుందా? జనవరి తర్వాత మనకు రావచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే అది ఖచ్చితమా కాదా అప్పుడే చెప్పలేం. కాకపోతే మన గతానుభవం మనల్ని హెచ్చరిస్తోంది. 

ఉధృతి.. విస్తృతి
ఈసారి కరోనా కొత్త స్ట్రెయిన్‌ని బ్రిటన్‌లో  కనుక్కొన్నారు. పాత స్ట్రెయిన్‌తో పోలిస్తే ఇది 70 నుంచి 80 రెట్లు ఎక్కువగా స్ప్రెడ్‌ అవుతుందని డాటా కూడా విడుదల చేశారు. ఈ సమాచారాన్ని ఆషామాషీగా విడుదల చేయలేదు. పూర్తి స్థాయి ల్యాబ్‌ ప్రయోగాల తర్వాతనే రిలీజ్‌ చేశారు. సదరన్‌ ఇంగ్లాండ్‌లో కనుక్కున్న పెద్ద సంఖ్యలో నమోదైన కేసుల్లో 70–80శాతం ఈ స్ట్రెయిన్‌కు చెందినవే. దీనిని బట్టి ఇది మరింత వేగంగా స్ప్రెడ్‌ అవుతుందని తేల్చారు. ఇది పాత స్ట్రెయిన్‌తో పోలిస్తే తీవ్రమైన నిమోనియాకు కారణం కావడం, మరణాల రేటు.. ఇవన్నీ ఎక్కువగా ఉంటాయా లేదా అనేది తెలీదు. (చదవండి: ఆర్టీపీసీఆర్‌లో చిక్కని బ్రిటన్‌ స్ట్రెయిన్‌..!)

వ్యాక్సిన్‌...రక్షించునా?
దేశ విదేశీ ఫార్మా కంపెనీల ద్వారా అందుబాటులోకి వస్తున్న వ్యాక్సిన్‌ల ద్వారా ఈ రెండో స్ట్రెయిన్ బారి నుంచి రక్షణ లభిస్తుందా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కాకపోతే ఏ వ్యాక్సిన్‌ అయినా కరోనా వైరస్‌ పైన ఉన్న ప్రొటీన్‌ని టార్గెట్‌ చేస్తాయి. ఒక్కో కంపెనీ ఒక్కో వ్యాక్సిన్‌ రిలీజ్‌ చేశాయి కాబట్టి ఇవి  వేర్వేరు ప్రొటీన్స్‌ని టార్గెట్‌ చేస్తాయి. కనుక ఈ వ్యాక్సిన్‌లు రెండో స్ట్రెయిన్‌కి కూడా పనిచేస్తాయని కొందరు సైంటిస్ట్‌లు అంటున్నారు. మల్టిపుల్‌ టార్గెట్స్‌ని వ్యాక్సిన్స్‌ టార్గెట్‌ చేస్తాయి కాబట్టి ఇవి పనిచేస్తాయని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఇది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. (చదవండి: 200 మంది పర్యాటకుల పరారీ )

వచ్చి తగ్గినా.. మళ్లీ రావచ్చు
కరోనా నుంచి కోలుకున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరందరూ తమకు మళ్లీ రాదు అనుకోవడం సరైంది కాదు. అప్పట్లో సెకండ్‌ ఇన్ఫెక్షన్‌ రాదనుకున్నారు. అయితే అది తప్పిన నిరూపించి.. మరణించిన కేసులు కూడా నమోదయ్యాయి. డెంగ్యూ వైరస్‌ వంటి అనుభవాలు చెప్పిన ప్రకారం... వైరస్‌ ఒకసారి వచ్చి తగ్గాక రెండో సారి మరింత తీవ్రంగా వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి కొత్త స్ట్రెయిన్‌ వచ్చినా తమకు రాదని.. వచ్చి తగ్గినవారు ధీమాగా ఉండడం సరైంది కాదు. ఒక్కోసారి శరీరంలో వృద్ధి చెందిన యాంటీ బాడీస్‌ మనల్ని రక్షించడం మానేసి ఇన్ఫెక్షన్‌ తీవ్రత పెరిగేందుకు కారణమవుతాయని పలు సందర్భాల్లో రుజువైంది. (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్‌)

కీడెంచి.. మేలెంచుదాం
మనం ఎలాగైతే వైరస్‌ మీద పై చేయి సాధించడానికి ప్లాస్మా థెరపీలనీ, అవనీ..ఇవనీ పలు రకాల మార్గాలు వెదుకుతుంటామో.. అలాగే వైరస్‌ కూడా మన ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే క్రమంలో మరింత బలపడుతూ రూపాంతరం చెందుతుంటుంది. వీటన్నింటిని బేరీజు వేస్తే.. మనల్ని మనం రక్షించుకోవడమే మార్గం. వ్యాక్సిన్‌ వచ్చేసింది. కేసులు తగ్గిపోతున్నాయి.. ఇంకేమీ పర్లేదు అనేది భ్రమ. సాధారణంగా పూర్తి సామార్థ్యం గల ఒక వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి అయిదారేళ్లు పడుతుంది. కానీ కరోనాకి యుద్ధప్రాతిపదికన కనిపెట్టిన వ్యాక్సిన్‌లు ఇవి. ఇవి ఎంత బాగా పనిచేస్తాయనేది ఇంకా క్లారిటీ లేదు. ఏదేమైనా ఏమరుపాటు ఏమాత్రం మంచిది కాదు. అమెరికాలో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే యూరప్‌ లాంటివి లాక్‌డౌన్‌ వైపు వెళుతున్నాయి. మరోవైపు జనంలో మాస్క్‌లు ధరించే అలవాటు తగ్గిపోతోంది. సోషల్‌ డిస్టెన్స్‌ దాదాపు మర్చిపోయాం. ఇది చాలా ప్రమాదకరం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన ప్రతి సూచనా మరో ఆర్నెళ్ల పాటు పాటించాల్సిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top