అమెరికాలో అలా .. ఆసియాలో ఇలా?

Type 2 diabetes in obese in America - Sakshi

జన్యు, వాతావరణ సంబంధిత వైవిధ్యతపై శాస్త్రవేత్తల దృష్టి 

అమెరికాలో ఊబకాయుల్లో టైప్‌ 2 మధుమేహం 

భారత్‌ లాంటి దేశాల్లో సన్నగా ఉన్నా సోకుతున్న వ్యాధి 

జన్యువుల పైభాగంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్లే ఈ తేడాలు 

ఈ పరిస్థితిని అధిగమించడం,వ్యాధి ముప్పును తగ్గించడం లక్ష్యంగా ‘డీప్‌’ప్రాజెక్టు 

అందరికీ సమర్థంగా ఉపయోగపడే మందుల తయారీకి దోహదం!  

సాక్షి, హైదరాబాద్‌:  మధుమేహంతో పాటు గుండెజబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా భారత్‌ ఇతర ఆసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. కానీ వ్యాధి సోకడం, లక్షణాల వంటివి ప్రాంతాన్ని బట్టి మారిపోతున్నాయి. మధుమేహాన్ని తీసుకుంటే టైప్‌ 2 మధుమేహం అమెరికా లాంటి దేశాల్లో ఊబకాయం ఉన్నవారిలో కన్పిస్తుంది.

కానీ భారత్‌లాంటి కొన్ని దేశాల్లో బక్కపలుచగా ఉన్నప్పటికీ దీనిబారిన పడుతున్నారు. అందరిలోనూ జన్యువులు ఒకే రకంగా ఉన్నప్పటికీ జన్యువుల పైభాగంలో వాతావరణం, సూక్ష్మ పోషకాల లోపం వల్ల చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల కారణంగా ఈ తేడాలు చోటు చేసుకుంటున్నట్లు తేలింది. మరోవైపు వీటి కోసం తయారు చేసిన ఔషధాలు ఒక ప్రాంతంలో పనిచేస్తే మరొక ప్రాంతంలో పని చేయడం లేదు.

మధుమేహంతో పాటు గుండె జబ్బులు, మానసిక సమస్యలకు పైన పేర్కొన్న తేడాలు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, అందరికీ సమర్ధంగా ఉపయోగపడే మందులు కనిపెట్టేలా, మానవజాతి ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఓ మహా ప్రయత్నం మొదలైంది. భారత్‌ సహా నాలుగు దేశాల్లోని 13 వేల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధి ముప్పును తగ్గించే ప్రాజెక్టుకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. డైవర్స్‌ ఎపిజెనిటిక్, ఎపిడిమియాలజీ పార్ట్‌ నర్‌షిప్‌ (డీప్‌) అని పిలుస్తున్న ఈ అంతర్జాతీయ ప్రాజెక్టులో ఇరవై పరిశోధక బృందాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై సంస్థలు భాగస్వాములు కానున్నాయి.  

ఇప్పటివరకు ‘యూరప్‌’ సమాచారమే ఆధారం 
ప్రజారోగ్యం విషయంలో ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలకు అత్యధికంగా యూరోపియన్‌ మూలాలున్న మానవుల నుంచి సేకరించిన సమాచారమే ఆధారం. అంటే ఆరోగ్య సమస్యల పరిశోధనల్లో ఇతర ప్రాంతాల వారి భాగస్వామ్యం చాలా తక్కువన్నమాట. అంతేకాకుండా జన్యుపరమైన, వాతావరణ సంబంధిత వైవిధ్యతను కూడా ఇప్పటివరకూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు.

కొంచెం వివరంగా చెప్పాలంటే మన జన్యువులు, మనం ఉన్న వాతావరణం ప్రభావం.. మనకొచ్చే వ్యాధులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పటివరకూ స్పష్టంగా తెలియదన్నమాట. కాగా ‘డీప్‌’ప్రాజెక్టు ఈ లోటును భర్తీ చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.25 కోట్ల ఖర్చుతో ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. సీసీఎంబీ నేతృత్వంలో యూకేలోని బ్రిస్టల్‌ యూనివర్సిటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్,, ఎంఆర్‌సీ యూనిట్, ద గాంబియాలు ఇందులో పాల్గొననున్నాయి.

అధ్యయనంలో భాగంగా కొన్ని వ్యాధులు కొన్ని ప్రాంతాల వారికి లేదా సమూహాలకు మాత్రమే ఎందుకు వస్తాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీనిద్వారా ఒక ప్రాంత ప్రజల కోసం తయారు చేసిన మందులు ఇతర ప్రాంతాల వారికీ సమర్థంగా ఉపయోగపడతాయా? లేదా? అన్నది స్పష్టమవుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త ఆర్‌.గిరిరాజ్‌ ఛాందక్‌ తెలిపారు.  

సీసీఎంబీ ఎప్పుడో చెప్పింది... 
హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) చాలాకాలంగా భారతీయుల జన్యు నిర్మాణంలోని తేడాలు.. టైప్‌–1, టైప్‌–2 మధుమేహం, క్లోమగ్రంథి వ్యాధులపై వాటి ప్రభావం గురించి పరిశోధనలు చేస్తోంది. విటమిన్‌ బీ–12, ఫొలేట్‌ తదితర సూక్ష్మ పోషకాలు, పర్యావరణాలు.. వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాలపై ప్రభావం చూపుతున్నట్లు కూడా సీసీఎంబీ నిరూపించింది.

పర్యావరణం నుంచి అందే సంకేతాల ఆధారంగా డీఎన్‌ఏలో వచ్చే కొన్ని రకాల మార్పులు మనిషి ఆరోగ్యం, వ్యాధులకు కారణమవుతున్నట్టుగా కూడా సీసీఎంబీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. అంటే ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలన్నీ యూరోపియన్లపై ఆధారపడి జరిగినవి కావడంతో వారికి పనిచేసే మందులు, చికిత్స పద్ధతులు కచ్చితంగా మనకూ పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదన్నమాట. అలాగే మనకు పనిచేసే మందులు బ్రిటిష్‌ వారికి లేదా అమెరికన్లను అక్కరకు వస్తాయా? అన్నది కూడా ప్రశ్నార్థకమే అన్నమాట.  

భారతీయులకూ భాగస్వామ్యం 
జన్యువులు – జన్యువులకు మధ్య, జన్యువులకు పర్యావరణానికి మధ్య జరుగుతున్న కార్యకలాపాలు అర్థం చేసుకునేందుకు మధుమేహం, గుండెజబ్బుల వంటి అసాంక్రమిక వ్యాధులకూ వీటికి ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టులో భారతీయులను కూడా చేర్చుకోవడం ఎంతో ఆసక్తికరమైన అంశం. – డాక్టర్‌ ఆర్‌.గిరిరాజ్‌ ఛాందక్, ‘డీప్‌’ప్రాజెక్ట్‌ హెడ్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top