మార్పులు లేవు! తెలంగాణ విద్యామండలి కీలక నిర్ణయం.. | Sakshi
Sakshi News home page

మార్పులు లేవు! ఆ విద్యార్థులకే ఇంజనీరింగ్‌..

Published Wed, Mar 17 2021 1:33 PM

TSCHE: No Changes In Eligibility Criteria For Telangana Engineering - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌లో చేరాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాల్సిన అవసరం లేదన్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మార్గదర్శకాలను 2021–22 విద్యా సంవత్సరంలో అమలు చేయబోమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడికి గురిచేసే ఎలాంటి మార్పులను, సంస్కరణలను అమలు చేయబోమని చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఏఐసీటీఈ దాదాపు 15 రకాల సబ్జెక్టులను పేర్కొందని, రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌లో ఐదారు రకాల బ్రాంచీలే (గ్రూపులు) ఉన్నాయని, వాటిల్లో ఏఐసీటీఈ పేర్కొన్న సబ్జెక్టులు పెద్దగా లేవని పేర్కొన్నారు. మంగళవారం తనను కలసిన మీడియాతో పాపిరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్‌ కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో కూడిన ఎంపీసీ బ్రాంచీ ఉందని, మెడికల్, అగ్రికల్చర్‌ కోర్సుల కోసం బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కూడిన బైపీసీ బ్రాంచీ ఉందని వివరించారు.

ఏఐసీటీఈ ఇటీవల జారీ చేసిన కాలేజీల అనుమతుల మార్గదర్శకాల్లో.. 2021–22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు బీఈ/ బీటెక్‌లో చేరాలంటే ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్‌/ మ్యాథమెటిక్స్‌/ కెమిస్ట్రీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్‌ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్‌/ బయోటెక్నాలజీ/ టెక్నికల్‌ వొకేషనల్‌ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్‌/ ఇంజనీరింగ్‌ గ్రాఫిక్స్‌/ బిజినెస్‌ స్టడీస్‌/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సబ్జెక్టుల్లో ఏవేనీ మూడు సబ్జెక్టులను చదివి ఉంటే చాలని పేర్కొందని వెల్లడించారు. వారు నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులేనని తెలిపిందని, మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులే ప్రధానంగా ఉన్నాయని, మిగతా సబ్జెక్టులేవీ లేవని వివరించారు.

సబ్జెక్టు అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/ యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయ మే ఫైనల్‌ అని ఏఐసీటీఈ పేర్కొన్న నేపథ్యంలో తాము ఈసారి వాటిని అమలు చేయబోమని వివరించారు. ఎంసెట్‌ ర్యాం కుల ఖరారులో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉందని, ఈ పరిస్థితుల్లో మార్పులు చేస్తే విద్యార్థుల్లో గందరగోళం నెలకొంటుందని వివరించారు. పైగా ఇప్పటికే ఎంసెట్‌ పరీక్ష తేదీలను ప్రకటించామని పేర్కొన్నారు. ఈసారి ఎంసెట్‌లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో 100 శాతం సిలబస్, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌నే ప్రామాణికంగా తీసుకొని ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏఐసీటీఈ మార్గదర్శకాలను అమలు చేయాల నుకుంటే నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.

20 నుంచి ఎంసెట్‌ దరఖాస్తులు 
ఎంసెట్‌–2021 నోటిఫికేషన్‌ను ఈనెల 18న జారీచేసేందుకు సెట్‌ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మే నెల 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఆలస్య రుసుముతో జూన్‌ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 20 నుంచి మే 18 వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మే 19 నుంచి 27 వరకు దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునే అవకాశం కల్పించనుంది. ఇక జూలై 5 నుంచి ఎంసెట్‌ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది.

జూలై 5, 6 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్షలు, జూలై 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ ఎంసెట్‌ను నిర్వహించనుంది. ప్రతిరోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో విడత పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 23 టెస్ట్‌ జోన్ల పరిధిలోని 58 పట్టణాల్లో పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement