ఎంసెట్‌కు 91 శాతం హాజరు

TS EAMCET 2022: 90 Percent Students Attend Eamcet Exam In Telangana - Sakshi

తెలంగాణలో 94.84 శాతం.. ఏపీ పరీక్ష కేంద్రాల్లో 77.98 శాతం

వరద ప్రాంతాల్లోనూ భారీగా హాజరు.. పేపర్‌ కాస్త తేలికే... గతం కన్నా బెటర్‌

తొలి రౌండ్‌పై విద్యార్థుల సంతృప్తి

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం జరిగిన టీఎస్‌ ఎంసెట్‌కు తొలి రోజు 91.31 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో భారీ స్పందన ఉంటే, ఏపీలో కాస్త తక్కువే కనిపించింది. సమస్యాత్మకంగా భావించిన వరద బాధిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనూ 96 శాతం హాజరు నమోదై నట్టు అధికారులు తెలిపారు. తొలిరోజు ఎంసెట్‌ విజయవంతంగా ముగిసిందని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు.

ఎక్కడా ఎలాంటి సాంకేతిక, ఇతర సమస్యలు తలెత్తలేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి స్పష్టం చేశారు. జేఎన్‌టీయూహెచ్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డితో కలసి ఆయన నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. టీఎస్‌ ఎంసెట్‌ ఈ నెల 14 నుంచే జరగాల్సి ఉంది. అయితే వర్షాల కారణంగా 14, 15న జరగాల్సిన పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే.

విద్యార్థుల పోటాపోటీ..
గతంలో పోలిస్తే ఈసారి ఎంసెట్‌ దరఖాస్తుల సంఖ్య పెరిగింది. అగ్రికల్చర్, మెడికల్, ఇంజనీరింగ్‌ కోర్సులకు కలిపి దాదాపు 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 88, ఏపీలో 19... మొత్తం 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి రోజున రెండు రాష్ట్రాల్లోనూ 58,547 మంది పరీక్ష రాయాల్సి ఉంటే, 53,509 (91.31 శాతం) మంది హాజరయ్యారు.

ఉదయం సాయంత్రం రెండు సమయాల్లో జరిగిన ఈ పరీక్షకు తెలంగాణవ్యాప్తంగా మంచి స్పందన కనిపించింది. రాష్ట్రంలో 46,570 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 44,169 (94.84 శాతం) హాజ రయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 11,977 మంది దరఖా స్తు చేసుకోగా, పరీక్షకు హాజరైంది మాత్రం 9,340 మంది (77.98 శాతం) మాత్రమే. ఇటీవలే ఏపీలో ఎంసెట్‌ జరగడంతో అక్కడ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదని అధికారులు విశ్లేషించారు. 

పరీక్షపై విద్యార్థుల సంతృప్తి
ఎంసెట్‌ పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రితం సంవత్సరం కన్నా ప్రశ్నపత్రం తేలికగా ఉందని హైదరా బాద్‌లోని ఓ పరీక్ష కేంద్రం వద్ద ఎంసెట్‌ విద్యార్థిని పద్మప్రియ, నిఖిలేష్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ మోడ్‌లో ఎలాంటి సమస్యా లేకుండా పరీక్ష రాయగలిగినట్లు వెల్లడించారు. మొత్తం ప్రశ్నల్లో కెమెస్ట్రీ తేలికగా చేసే వీలుందని, ఫిజిక్స్‌ కాస్త మధ్యస్తంగా ఉందని, మేథ్స్‌ సుదీర్ఘ ప్రశ్నలతో ఉందని గణిత శాస్త్ర నిపుణులు ఎంఎన్‌ రావు తెలిపారు. మొత్తం మీద విద్యార్థులు ఈ పరీక్షను తేలికగా రాయగలిగినట్లు ఆయన తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top