సభ్యత్వ నమోదు వేగం పెంచండి రేవంత్‌రెడ్డి

TPCC chief Revanth Reddy directed presidents increase party membership registration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు వేగం పెంచాలని పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తమ సంఘాల పరిధిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని, సభ్యత్వం తీసుకునేందుకు అర్హులైన వారిని గుర్తించి చేర్పించాలన్నారు. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి సభ్యత్వ నమోదుపై ఆయన సమీక్షించారు. పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల వారీ ఇన్‌చార్జులతో పాటు అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రేవంత్‌ మాట్లాడుతూ.. అన్ని అనుబంధ సంఘాలు పార్టీ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలని, పార్టీకి వెన్నెముక లాంటి ఎన్‌ఎస్‌యూఐ, యూత్, మహిళా కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో మరింత క్రియాశీలంగా పార్టీ సభ్యుల చేరిక జరగాలని అన్నారు.

అనుబంధ సంఘాలకే నేరుగా సభ్యత్వ లింకులు ఇచ్చినందున వీలైనంత త్వరగా కార్యక్రమం పూర్తి చేయాలని కోరారు. అనుబంధ సంఘాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని, 3 నెలల్లో అన్ని సంఘాలు క్రియాశీలం కాకపోతే బాధ్యులపై వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని మహేశ్‌కుమార్‌గౌడ్‌ హెచ్చరించారు. కాగా, రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకొనే ఈ పండుగపూట ప్రజలకు అంతా మంచి జరగాలని ఆయన అభిలషించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top