
కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఆలోచన
సీఎం రేవంత్‌తో చర్చించాలని మంత్రి జూపల్లి నిర్ణయం
నగరంలో స్వచ్ఛమైన కల్లు 10 శాతమే.. 90 శాతం కల్తీనే..
10 గ్రాముల ఆల్ఫాజోలంతో 100 పెట్టెల కల్లు తయారీ
సాక్షి, హైదరాబాద్: కల్తీ కల్లుతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో కల్లు విక్రయాలను పూర్తిగా నిషేధించాలని ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోంది. నిషేధం విధించడానికి ముందు సంబంధిత వర్గాలన్నింటితో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది. కల్లుపై నిషేధం రాజకీయపరమైన సమస్యలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా డీల్ చేయాలని యోచిస్తోంది.
నగరంలోని కల్లు సొసైటీల్లో ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపై సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. కల్లుపై నిషేధం గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నగరంలో విక్రయిస్తున్న కల్లులో 90 శాతం కృత్రిమంగా తయారుచేసినదే ఉంటోందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
చెట్ల నుంచి సహజంగా తీసిన కల్లు 10 శాతమేనని అంటున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 97 కల్లు సొసైటీలు ఉన్నాయి. ఒక్కో సొసైటీ పరిధిలో రోజూ 10 నుంచి 20 పెట్టెల (ఒక్కో పెట్టెలో 10 – 12 సీసాలు) కల్లు విక్రయాలు జరుగుతుంటాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇందులో 90 శాతం ఆ్రల్ఫాజోలం వంటి రసాయనాలతో తయారుచేసినదే ఉంటోందని సమాచారం.
ఈ ఆల్ప్రాజోలం ఎక్కువగా మహారాష్ట్ర నుంచి వస్తున్నట్లు చెబుతున్నారు. ఒక కిలో ఆల్ప్రాజోలం ధర దాదాపు రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఎక్సైజ్ అధికారులు గత మూడేళ్లలో అడపాదడపా నిర్వహించిన దాడుల్లోనే దాదాపు 64 కిలోల ఆ్రల్పాజోలంను స్వా«దీనం చేసుకున్నారు.
వైఎస్సార్ హయాంలో నిషేధం..
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నగరంలో కల్లు అమ్మకాలను నిషేధించారు. దాదాపు 12 సంవత్సరాలపాటు కల్లు విక్రయాలు బంద్ అయ్యాయి. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి బీఆర్‌ఎస్ (నాడు టీఆర్‌ఎస్) అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ కల్లు విక్రయాలు ప్రారంభం అయ్యాయి.
నగర శివార్లలో అప్పట్లో తాటి చెట్లు పెద్ద ఎత్తున ఉన్నా.. అవి స్థానిక అవసరాలకే పరిపోవడం లేదని, అక్కడ నుంచి నగరానికి కల్లు సరఫరా సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే వైఎస్‌ఆర్ హయాంలో నిషేధం విధించారని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రియల్‌ఎస్టేట్ కారణంగా ఉన్న చెట్లన్నీ నరికేశారని, హైదరాబాద్‌కు నిజామాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని చెట్లను కేటాయించినా.. అక్కడి నుంచి కల్లు గీసి తీసుకురావడం లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్టవ్యాప్తంగా కల్లు సొసైటీలు 4,064 ఉంటే 4,697 దుకాణాలు ఉన్నాయి. అందులో సభ్యులుగా 1,95,391 మంది లైసెన్స్ విక్రయదారులు ఉన్నారు. 3,541 టీఎఫ్‌టీ (ట్రీ ఫర్ ట్రేడింగ్) కమిటీల కింద మరో 29,279 మంది ఉన్నారు. 2014 నుంచి 2025 వరకు కల్తీ కల్లు విక్రయాలపై నమోదైన కేసుల సంఖ్య కూడా దారుణంగా పడిపోయింది. 2014లో 9,562 కేసులు నమోదైతే, 2025లో 516 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం.