
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ముంటే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి కనీసం ఒక అరగంట కదలకుండా కూర్చొని ఏకాగ్రతతో చదవాలని, నిరుద్యోగ యువత సమస్యలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం లేదని.. కోర్టు తీర్పును అమలు చేయకుండా గ్రూప్-1 అభ్యర్థులను మోసం చేస్తోందంటూ నిరసనకు దిగారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని వట్టికోట ఆళ్వారు స్వామి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో కలిసి గంటన్నర పాటు పుస్తక పఠనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లైబ్రరీకి వెళ్లి చదువుకోవడానికి, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి లైబ్రరీకి వస్తే కూడా ఆంక్షలు విధించడం ఏంటని ప్రభుత్వాన్ని విమర్శించారు. గంటన్నర చదవడానికే చాలా ఇబ్బందిపడ్డానని నిరుద్యోగులు 4 ఏళ్ల నుండి చదువుతున్నారని,వారెంత బాధ పడుతున్నారో తెలుసుకోవాలన్నారు. చదువు, నిరుద్యోగుల కష్టం గురించి తెలియాలంటే రేవంత్ రెడ్డి లైబ్రరీకి వచ్చి కనీసం అరగంట ఏకాగ్రతతో చదవాలని సవాల్ విసిరారు.
చదవకుండా క్రిమినల్ కేసులున్న వ్యక్తి రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువత చాలా కష్టపడి, గత మూడు, నాలుగేండ్లుగా ఉద్యోగ్ల కోసం చదువుతూనే ఉన్నారన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడంలో విఫలమైందని, జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఏం మాట్లాడినా రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనడం సరైంది కాదన్నారు. బి ఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల తరపున నిరంతరం కొట్లాడుతుందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేనపుడు పోలీసులు ఎలా అడ్డుకుంటారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర హై కోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. కోర్టు 222 పేజీల తీర్పును ఇచ్చిందని, కోర్టు తీర్పులో చివరి 15 పేజీల రిపోర్టు చదివితే నిరుద్యోగ యువత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై ఖచ్చితంగా నమ్మకాన్ని కోల్పోతారన్నారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ కోర్టును సంప్రదించడం అంటే,నిరుద్యోగులను అవమానపరచడమేనన్నారు.