ఒక్కపేషంట్ పీపీఈ కిట్ల బిల్లు 2,23,560 | Three Lakh Bill For COVID 19 Patient Only For PPE Kits in Hyderabad | Sakshi
Sakshi News home page

పీపీఈ కిట్లు @ రూ.2,23,560

Aug 1 2020 8:44 AM | Updated on Aug 1 2020 8:44 AM

Three Lakh Bill For COVID 19 Patient Only For PPE Kits in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అబిడ్స్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగికి ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. కుటుంబ సభ్యులు చికిత్స కోసం జులై 22న బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌లోని విరించి ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. కాగా చికిత్స పొందుతూ శక్రవారం ఉదయం మృతి చెందారు. ఎనిమిది రోజుల్లో  కేవలం ఒక్క కోవిడ్‌ పేషంట్‌కు 246 పీపీఈ కిట్లు వినియోగించినట్లు చూపించారు. ఇందుకుగాను ఒక్కో కిట్టుకు రూ.920 చొప్పున మొత్తం రూ.2,23,560 బిల్లు వేశారు. ఎనిమిది రోజుల్లో మొత్తం వైద్యానికి అయిన ఖర్చు రూ.8 లక్షలు కాగా, అందులో కేవలం పీపీఈ కిట్ల ఛార్జే రూ.2 లక్షలకు పైగా ఉండటంతో బాధితుని కుటుంబ సభ్యులు ఆశ్చర్య పోయారు. ఒక్క రోగికి ఇన్ని కిట్లు ఎప్పుడు వాడారో స్పష్టం చేయాలని మృతుని కుమార్తె నిలదీయడంతో ఆస్పత్రి యాజమాన్యం నీళ్లు నమలాల్సి వచ్చింది. ఇదీ ఒక్క అబిడ్స్‌కు చెందిన బాధితునికే కాదు...కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయి అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేరుతున్న పలువురు బాధితులు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు. రోగికి వాడిన మందులు, కన్సల్టెంట్‌ ఛార్జీల కంటే ఎక్కువగా వెంటిలేటర్, పీపీఈ కిట్ల ఛార్జీలు ఉంటుండటం విశేషం. 

కృత్రిమ కొరత సృష్టించి..భారీగా బిల్లులు
 కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సలకు ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. సాధారణ ఐసోలేషన్‌ చికిత్సకు రోజుకు రూ.4 వేలు, ఐసీయూ చికిత్సలకు రూ.7500, వెంటిలేటర్‌పై చికిత్సకు రూ.9000గా నిర్ణయించింది. చికిత్సల్లో భాగంగా వైద్య సిబ్బంది వినియోగించే  పీపీఈ కిట్లు, ఎంఆర్‌ఐ, సీటీ వంటి ఖరీదైన టెస్టుల చార్జీలను ఆస్పత్రులకే వదిలేసింది. నగరంలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు దీనిని అవకాశంగా తీసుకుని కోవిడ్‌ చికిత్సల పేరుతో ఇష్టం వచ్చినట్లు బిల్లులు వేస్తున్నాయి. నిజానికి ఒక్కో కార్పొరేట్‌ ఆస్పత్రిలో 50 నుంచి వంద వరకు ఐసోలేషన్, ఐసీయూ పడకలను ఏర్పాటు చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రభుత్వ ఆస్ప్రతుల్లో 8446 పడకలకు 2282 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఇంకో 6164 పడకలు ఖాళీగా ఉన్నాయి. 95 కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో 6409 పడకలు ఉండగా, వీటిలో ప్రస్తుతం 3832 మంది చికిత్స పొందుతున్నారు. 2527 పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన మెడికల్‌ బులెటన్‌లో వెల్లడించింది. అయితే ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నప్పటికీ.. పడకల కృత్రిమ కొరత సృష్టిస్తూ అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులను చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి.  

ఫిర్యాదులు అందినా..చర్యలు శూన్యం
కార్పొరేట్‌ ఆస్పత్రి నిర్ణయించిన టారిఫ్‌ ప్రకారం బిల్లు చెల్లించేందుకు అంగీకరించిన బాధితులకు పడకలు కేటాయిస్తున్నాయి. వెంటిలేటర్‌ చికిత్సల పేరుతో భారీగా బిల్లులు వేస్తున్నాయి. అసలు మందులే లేని చికిత్సకు ఖరీదైన మందులు వాడినట్లు చూపిస్తూ రోజుకు రూ.లక్ష చొప్పున బిల్లులు వసూలు చేస్తున్నారు. అధిక బిల్లులపై ఫిర్యాదు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నంబర్‌కు రోజుకు వందకుపైగా ఫిర్యాదులు అందుతున్నా...ఇప్పటి వరకు ఒక్క ఆస్పత్రిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అంతేకాదు ఐసోలేషన్‌ వార్డులో 25 నుంచి 40 మంది కోవిడ్‌ బాధితులు ఉంటే..ఒక్కో బాధితుని చికిత్సకు వందకుపైగా పీపీఈ కిట్లు వాడుతున్నట్లు చూపుతున్నాయి. ఆస్పత్రిలో వాడిన మొత్తం పీపీఈ కిట్ల ధరను ఒక్క రోగి నుంచే వసూలు చేస్తుండటం కొసమెరుపు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement