నాన్నా.. నన్ను కాపాడు | tenth class student died to fever at komaram bheem district | Sakshi
Sakshi News home page

నాన్నా.. నన్ను కాపాడు

Aug 11 2024 8:07 AM | Updated on Aug 11 2024 8:07 AM

tenth class student died to fever at komaram bheem district

తీవ్ర జ్వరం బారినపడిన ఓ టెన్త్‌ విద్యార్థిని వేడుకోలు
వైద్యం కోసం తరలిస్తుండగా మృతి  

కౌటాల: ‘నాన్నా.. నన్ను కాపాడు’.. తీవ్ర జ్వరంబారిన పడిన ఓ టెన్త్‌ విద్యార్థిని తన తండ్రితో పలికిన చివరి మాటలు ఇవి. దీంతో ఆ తండ్రి మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతిచెందింది. కుమా ర్తె మృతిని తట్టుకోలేకపోతున్న తండ్రి.. ‘నిన్ను కాపాడుకోలేక పోయిన బిడ్డా’అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గుండాయిపేటలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. గుండాయిపేటకు చెందిన జాడె కిశోర్, సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం. 

పెద్ద కుమార్తె పూజ (16) జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో ఉంటూ టెన్త్‌ చదువుతోంది. జ్వరం రావడంతో గత శనివారం తండ్రికి ఫోన్‌ చేసింది. ‘నాన్నా జ్వరమొచి్చంది.. చేతనైతలేదు.. కాళ్లు చేతులు గుంజుతున్నయ్‌.. ఇంటికి తీసుకుపో’అని చెప్పింది. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. స్థానిక ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించినా జ్వరం తగ్గకపోగా శుక్రవారం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా శనివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించింది. 

దీంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో పూజ తన తండ్రి చేయి పట్టుకొని తనను కాపాడాలని కోరింది. దీంతో తండ్రి ఏమీ కాదని ధైర్యం చెప్పాడు. కానీ కాసేపటికే పూజ మరణించింది. కాగా, గుండాయిపేట గ్రామంలో కొద్ది రోజులుగా విష జ్వరా లు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు ఉన్నారు. జ్వరాల నియంత్రణకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement