అంతర్రాష్ట్ర సర్వీసులపై చర్చ 

Telugu State RTC MDs Meeting About RTC Interstate Services - Sakshi

రేపు తెలంగాణ, ఏపీ ఆర్టీసీ ఎండీల భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించే విషయంపై చర్చించేందుకు సోమవారం రెండు ఆర్టీసీల ఎండీలు సమావేశం కానున్నారు. బస్‌భవన్‌లో గాని.. ఎర్రంమంజిల్‌ ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో గాని ఈ భేటీ జరగనుంది. తొలుత ఓ పర్యాయం విజయవాడలో, ఆ తర్వాత బస్‌భవన్‌ లో ఈడీల స్థాయిలో సమావేశాలు జరిగాయి. కానీ చర్చలు పూర్తిగా కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులు టీఎస్‌ఆర్టీసీ కంటే లక్ష కిలోమీటర్ల మేర ఎక్కువగా అంతర్రాష్ట్ర ట్రిప్పులు తిరుగుతున్నాయి. దీన్ని తెలంగాణ ఆర్టీసీ తప్పుపడుతోంది. రెండు ఆర్టీసీలు సమంగా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేలా ఒప్పందం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది.

దీనికి ఏపీఎస్‌ ఆర్టీసీ సమ్మతించినా... సమంగా చేసే విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. లక్ష కిలోమీటర్ల మేర తెలంగాణ బస్సులు కూడా ఏపీ పరిధిలో తిప్పితే సరిపోతుందని ఏపీ ఆర్టీసీ పేర్కొంటోంది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నందున, అదనంగా అన్ని కిలోమీటర్ల మేర బస్సులు తిప్పటం కుదరదని, ఏపీ అంతమేర తక్కువగా తిప్పాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. మధ్యేమార్గంగా తాము 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, తెలంగాణ 50 వేల కి.మీ. మేర పెంచుకుంటే సరిపోతుందని ఏపీ అధికారులు ప్రతిపాదించారు. దీనికీ తెలంగాణ అధికారులు సమ్మతిచడం లేదు. ఈ నేపథ్యంలో సయోధ్య కుదిరేలా ఇరు ఆర్టీసీల ఎండీలు భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రుల భేటీ సోమవారం ఉంటుందంటూ వార్తలు వెలువడ్డాయి. దీన్ని తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖండించారు. ఎండీల స్థాయిలోనే సమావేశం కోసం మాత్రమే అంగీకరించామని వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top