Telanagana: కీలక దశకు చేరుకున్న ఉద్యోగుల విభజన

telangana: Staff Allotment to New Local Cadres Nearing Completion - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల విభజన కీలక దశకు చేరుకుంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల జిల్లా కేడర్‌ కేటాయింపులు మొత్తం పూర్తయ్యాయి. వారంతా దాదాపు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్తున్నారు. ఈ రిపోర్టింగ్‌ ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో ముగియనుంది. ఇక జోనల్, మల్టీజోనల్‌కు సంబంధించి కొన్ని శాఖల్లో కేటాయింపులు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. దీంతో అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగుల లెక్క పక్కాగా తెలిసే వీలుందని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే ఇప్పటివరకూ జరిగిందంతా కేడర్‌ విభజన మాత్రమేనని, ఎవరు ఏ జిల్లా, జోన్, మల్టీజోన్‌ అనే దానిపైనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పనిచేసే చోటు నుంచి రిలీవ్‌ కాకుండా కొత్త జిల్లాల్లో రిపోర్టు చేయడాన్ని కేడర్‌ విభజనగా తీసుకోవాలే తప్ప కొత్త ప్రాంతంలో వెంటనే పనిచేయాలన్నట్లు కాదని ప్రభుత్వ వర్గాలూ స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలవారీ విభజనతోపాటే భార్యాభర్తలు, వికలాంగుల బదిలీలు, ఇతర అభ్యంతరాలను స్వీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ రకమైన అప్పీళ్లను పరిశీలించాక కొన్ని మార్పుచేర్పులు జరిగే వీలుంది. మొత్తమ్మీద వచ్చే నెల 20 నాటికి క్షేత్రస్థాయి విభజన తుది దశకు చేరుకుంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్‌ విభజన తక్షణ అవసరం కావడంతో ఈ కసరత్తు పూర్తవుతోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 
చదవండి: పాక్‌ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు.. కుట్ర పన్నింది ఇలా... 

శేషప్రశ్నలెన్నో... 
మిగతా ప్రభుత్వ శాఖల్లో విభజన పెద్దగా సమస్యలు తేవట్లేదు. విద్యాశాఖలోనే అనేక సందేహాలకు తావిస్తోంది. మెజారిటీ టీచర్ల విభజన జిల్లా స్థాయిలోనే ఉంది. ఈ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉపాధ్యాయులు ప్రస్తుత జిల్లా నుంచి కొత్త జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. పోస్టింగ్‌ ఇచ్చే జిల్లాలో విద్యాశాఖ కౌన్సెలింగ్‌ జరిపి ఏ స్కూల్‌లో పనిచేయాలనేది నిర్ణయిస్తుంది. దీనికోసం విద్యాశాఖ విధివిధానాలు రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లా మారిన వారికే బదిలీలు చేపట్టాలా? సాధారణ బదిలీల మాదిరి మార్గదర్శకాలు ఇవ్వాలా? సీనియారిటీ కొలమానమైతే ఇవ్వాల్సిన ఆప్షన్లు ఏమిటి? ఇలా అనేక అంశాలపై గురువారం అధికారులు చర్చించారు.
చదవండి: టీఆర్‌ఎస్‌కు త్వరలో కొత్త ‘టీమ్‌’.. కసరత్తు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

కేడర్‌ విభజన పూర్తయింది కాబట్టి బదిలీల ప్రక్రియను విద్యాసంవత్సరం ముగిసేవరకూ వాయిదా వేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. జిల్లా కేడర్‌ ఇచ్చిన టీచర్‌ అప్పటివరకూ ఉన్న చోటే పనిచేస్తే నష్టమేమీలేదని అధికారులు అంటున్నారు. ఇది పాలనాపరమైన సమస్యకు దారితీస్తుందని విద్యాశాఖలోని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖలో మూడేళ్లుగా బదిలీల్లేవు. దీంతో అన్ని ప్రాంతాల్లో టీచర్లు ట్రాన్స్‌ఫర్లు అడుగుతున్నారు. ఏప్రిల్‌లో బదిలీలు చేపట్టాలని అధికారులు కేడర్‌ విభజనకు ముందు నిర్ణయించారు. దీంతో ఇప్పటికిప్పుడు బదిలీలు ఎందుకని అధికారులు భావిస్తున్నారు. దీనిపై త్వరలో స్పష్టత రావచ్చని ఓ అధికారి తెలిపారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top