షోలాపూర్‌ ఎన్టీపీసీ ప్లాంట్‌కు సింగరేణి బొగ్గు 

Telangana: Singareni Company Supplying Coal For Solapur NTPC Plant - Sakshi

ఏడాదికి 25.40 లక్షల టన్నుల సరఫరా 

సాక్షి, హైదరాబాద్‌: మన సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటివరకు కోల్‌ ఇండియా సంస్థ నుంచి బొగ్గును సరఫరా చేసుకుంటున్న ఎన్టీపీసీ ఇక సింగరేణి నుంచి బొగ్గు తీసుకోనుంది. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో రెండు సంస్థల అధికారుల మధ్య ఇంధన సరఫరా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు ఏడాదికి 25.40 లక్షల చొప్పున 25 ఏళ్ల పాటు సింగరేణి బొగ్గును మహారాష్ట్రలోని షోలాపూర్‌ యూనిట్‌–1కు సరఫరా చేయనుంది.

ఇప్పటివరకు కోల్‌ ఇండియా నుంచి బొగ్గును తీసుకుంటున్న ఎన్టీపీసీ.. నాణ్యత, నిరంతరాయ సరఫరా కోసం సింగరేణి నుంచి బొగ్గు తీసుకుంటే తమకు లాభదాయకంగా ఉంటుందని భావించింది. బొగ్గు మంత్రిత్వ శాఖ అంగీకారాన్ని కోరగా, ఇందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ అంగీకరించింది. అయితే, సింగరేణి సంస్థ ఇప్పటికే దేశంలోని 8 రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీపీసీ థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు ఇస్తోంది.

ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్లాంట్‌లకు యేటా 135.30 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. షోలాపూర్‌ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా కోసం జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సింగరేణి తరఫున కోల్‌ మూవ్‌మెంట్‌ ఈడీ జె.ఆల్విన్, మార్కెటింగ్‌ జీఎం కె.రవిశంకర్, డీజీఎం వెంకటేశ్వర్లు, ఎన్టీపీసీ ప్రాంతీయ ఈడీ మనీశ్‌ జవహరి, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.ఎన్‌.రావు, ఏజీఎం పి.కె.రావత్‌లు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top