ఫీజు బాదుడుకు ‘ఆన్‌లైన్‌’ సాకు 

Telangana Private Engineering Colleges Increases Fees Showing Online Classes - Sakshi

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల కొత్త సినిమా

లాక్‌డౌన్‌లోనూ డిజిటల్‌ క్లాసుల లెక్క 

హై టెక్నాలజీనే అత్యధిక ఖర్చంట

టీఏఎఫ్‌ఆర్‌సీ ముందుకు ఆడిట్‌ రిపోర్టులు

 ప్రైవేటు కాలేజీలతో అధికారుల బేరాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఫీజుల పెంపుకోసం ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఇప్పుడు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ బోధనకు సమకూర్చిన మౌలిక సదుపాయాల వ్యయాన్ని ముందుకు తెచ్చే యోచనలో ఉన్నాయి. దీనికోసం వేగంగా స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్య మండలి మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ మండలి (టీఏఎఫ్‌ఆర్‌సీ) మూడేళ్లకోసారి రాష్ట్రంలోని వృత్తి విద్యా కోర్సుల ఫీజుల పెంపును పరిశీలిస్తుంది. 2019–20లో ఇంజనీరింగ్, ఫార్మసీ ఫీజులు పెంచారు.

ఈ పెంపు ఈ ఏడాది (2021–22) వరకూ అమల్లో ఉంటుంది. తిరిగి వచ్చే మూడేళ్లకు ఫీజులు పెంచాల్సి ఉంది. దీనిపై ఇటీవల ఉన్నత విద్యా మండలి, టీఏఎఫ్‌ఆర్‌సీ సమాలోచనలు జరిపింది. ఎప్పటిలాగే ఫీజుల పెంపునకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.  

అది చెప్పలేక...: నిబంధనల ప్రకారం ప్రైవేటు కాలేజీల గొంతెమ్మ కోర్కెలను నియంత్రణ మండలి అంగీకరించకూడదు. కాలేజీలో ఫీజుల ద్వారా ఇప్పుడొచ్చే ఆదాయం ఎంత? ఈ మూడేళ్లలో రాబడికి మించి ఏం ఖర్చు చేశారు? మౌలిక వసతులు పెంచారా? విద్యార్థుల నైపుణ్యం పెంచే విధంగా తీసుకున్న చర్యలేంటి? ఎంతమందికి ఉపాధి లభించింది? లాంటి సవాలక్ష ప్రశ్నలకు కాలేజీ యాజమాన్యాలు సమాధానం ఇవ్వాలి. దీనికోసం ప్రతీసారి కాలేజీలు ఆడిట్‌ రిపోర్టును ప్రముఖ ఆడిటర్ల సాయంతో పక్కాగా తయారు చేస్తాయి.

వచ్చిన ప్రతీపైసా విద్యార్థుల కోసమే ఖర్చు పెట్టినట్టు అరచేతిలో వైకుంఠం చూపిస్తా యి. 2019లో ఇలా చేసే కొన్ని కాలేజీలు ఏడాది ఫీజును రూ.1.35 లక్షల వరకూ తీసుకెళ్లాయి. రూ.35 వేలకు పైబడ్డ ప్రతీ కాలేజీ వార్షిక ఫీజును 20% మేర పెరిగింది. కానీ ఈసారి ఆ అవకాశం  కన్పించడం లేదు. 2020 నుంచి కోవిడ్‌ చుట్టుముట్టింది. విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే కాలం గడపాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు  మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమం కోసం వెచ్చించామని చెప్పుకునే అవకాశమే లేదు. పైగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో ఫీజుల పెంపు వ్యతిరేకతకు దారి తీయొచ్చు.  

అధికారుల సలహాలు.. 
‘లాక్‌డౌన్‌ ఉన్నా.. కాలేజీ తెరవకపోయినా మేం ఆన్‌లైన్‌’క్లాసులు పెట్టాం అని ప్రైవేటు కాలేజీలు సరికొత్త కథ విన్పించేందు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ దిశగా ముందుకెళ్తున్న ఆడిటర్లు ఇటీవల ఉన్నత విద్యామండలి అధికారులతో సం ప్రదింపులు జరిపారు. పెట్టేది ఏదైనా పక్కాగా ఉండేలా చూసుకోండని మండలి అధికారులే వారికి సలహా ఇవ్వడం గమనార్హం. కొంతమంది మండలి అధికారులైతే ఏకంగా రిపోర్టు తయారు చేసేప్పుడు తాము సహకరిస్తామని ప్రైవేటు కాలేజీలతో బేరాలు కుదర్చుకుంటున్నట్టు తెలిసింది.

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం భారీగా ఖర్చు పెట్టినట్టు ఆడిట్‌ రిపోర్టు తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. పెద్ద మొత్తం వెచ్చించి ‘హైక్లాస్‌’లెక్చరర్లతో క్లాసు లు చెప్పించామని, ఆధునిక టెక్నాలజీ వాడామని నమ్మబలికే ఎత్తుగడలు వేస్తున్నాయి.  మొత్తం మీద ఆన్‌లైన్‌ ఆడిట్‌తో ఫీజులు పెంచుకోవాలని ప్రైవేటు కాలేజీలు కలలుగంటున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి ఎఫ్‌ఆర్‌సీ ముద్ర వేస్తే భారీగానే ఫీజులు పెరిగే అవకాశముంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top