ఒక రోజు అసెంబ్లీ ! | telangana to pass resolution seeking 21 as minimum age to contest lok sabha and assembly polls | Sakshi
Sakshi News home page

ఒక రోజు అసెంబ్లీ !

Jul 30 2026 5:42 AM | Updated on Jul 30 2026 5:42 AM

telangana to pass resolution seeking 21 as minimum age to contest lok sabha and assembly polls

చట్టసభల్లోకి వెళ్లే యువత వయసు 25 నుంచి 21కి తగ్గింపుపై చర్చ 

తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ప్రభుత్వ ఆలోచన 

ఆగస్టు మొదటి వారంలోనే నిర్వహించే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఒక రోజుకు మాత్రమే పరిమితం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. వర్షాకాల సమావేశాల్లో చట్టసభల్లోకి అడుగిడే యువత వయసు ప్రస్తుతం ఉన్న 25 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు తగ్గించే అంశంపై తీర్మానం ప్రవేశపెట్టి, చర్చ అనంతరం ఆమోదించిన తరువాత వాయిదా పడుతుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు చెప్పాయి. ఈ సమావేశాలను ఆగస్టు మొదటి వారంలోనే నిర్వహించే అవకాశం ఉందన్నాయి. తీర్మానం ఆమోదించిన వెంటనే దాన్ని కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌ సమయంలోనూ వయసు తగ్గింపు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన సంగతి విదితమే. ప్రస్తుతానికి ఒక్కరోజునే సమావేశాలు ఏర్పాటు చేసి, శీతాకాల సమావేశాల సమయంలో ఎక్కువ రోజులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బడ్జెట్‌ సమావేశాల తరువాత అసెంబ్లీ ప్రొరోగ్‌ కాకపోవడం వల్ల.. నేరుగా స్పీకర్‌ అసెంబ్లీని సమావేశపర్చడానికి అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అదీకాక అసెంబ్లీలో ప్రస్తుతం మరమ్మతులు జోరుగా సాగుతున్నాయి.

సెంట్రల్‌ హాల్‌ ఏర్పాటు, కిందనున్న మంత్రుల చాంబర్స్‌ను పైకి మార్చడం, సీఎం చాంబర్‌కు మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. కింద సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనసభా వ్యవహారాల మంత్రి చాంబర్లు మాత్రమే ఉంటాయి. మిగిలిన మంత్రుల చాంబర్లను మొదటి అంతస్తులోకి మార్చాలని నిర్ణయించారు. ఈ మరమ్మతులన్నీ సెప్టెంబర్‌ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం సీఎల్పీ కార్యాలయం స్థానంలో పూర్తి గ్రీనరీని ఏర్పాటు చేయాలని మొదట్లో భావించారు. ప్రస్తుతం దాని మార్పు గురించి ఎలాంటి చర్చ జరగడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement