విద్యుత్‌లో తెలంగాణ నయా రికార్డు!

Telangana New Record In Power Distribution - Sakshi

రికార్డు స్థాయిలో సరఫరా చేసిన ఉత్తర, దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు

ఏటేటా పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం

అగ్రస్థానంలో మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్‌

2018 జనవరి 1 నుంచి అన్ని పంపు సెట్లకు నిరంతర విద్యుత్‌ సరఫరా

ఎత్తిపోతల పథకాలకు పెరిగిన డిమాండ్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: విద్యుత్‌ సరఫరాలో తెలంగాణ మరోసారి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఉమ్మడి ఏపీలో సైతం ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈ సీజన్‌లో అత్యధిక వినియోగం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి చివరి వారం (23న) అత్యధికంగా 13,162 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరగ్గా ఈ నెల మొదటి వారంలో ఒక్క తెలంగాణలోనే 13,141 మెగావాట్ల వినియోగం జరగడం రికార్డుగా విద్యుత్‌ సరఫరా సంస్థలు ప్రకటించాయి. వాతావరణం చల్లబడి, వరి కోతలు చేపడుతున్న సమయంలో శుక్రవారం కూడా భారీగా విద్యుత్‌ వినియోగం అయినట్లు నమోదైంది. ఈ సీజన్‌లో ఇంత పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌), దక్షిణ మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) విద్యుత్‌ సరఫరా చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి.

ఏటా పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం 
టీఎస్‌ ఎన్పీడీసీఎల్, టీఎస్‌ఎస్పీడీఎల్‌ పరిధిలో ఏటేటా విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన విద్యుత్‌ వినియోగం వివరాలను విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఇటీవల ప్రకటించాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2021’ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2016-17లో తెలంగాణలో 9,187 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ నమోదవగా 2017-18లో అది 10,284 మెగావాట్లకు చేరింది. అలాగే 2018-19లో 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ నమోదుకాగా 2019–20లో డిమాండ్‌ 11,703 మెగావాట్లకు చేరింది. దేశ సగటు వృద్ధి శాతం 3.44గా నమోదవగా తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 8.18 శాతంగా నమోదైంది.

పంపుసెట్లకు నిరంతర ఉచిత విద్యుత్‌ 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో కీలకమైనది వ్యవసాయానికి ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా. 2018 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంపు సెట్లకు 24 గంటల విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 19 లక్షలకుపైగా పంపు సెట్లు ఉంటే ఇప్పుడు 24 లక్షలకుపైగా కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా మరో 4.20 లక్షల వరకు ఉంటాయని అధికారుల అంచనా. అలాగే రాష్ట్రం ఏర్పడే నాటికి 1.10 కోట్ల వరకు వివిధ రకాల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా ఈ ఏడాది మార్చి 31 నాటికి వాటి సంఖ్య 1.55 కోట్లు దాటింది. ఈ లెక్కన విద్యుత్‌ కనెక్షన్లలో 38.62 శాతం వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఇదే స్థాయిలో సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా పెరిగాయి. కాగా వీటితో పాటు 2014 వరకు 680 మెగావాట్ల విద్యుత్‌ ఎత్తిపోతల పథకాలకు వినియోగించగా, కాళేశ్వరం లాంటి భారీ పథకాలు తోడవడంతో ప్రస్తుతం 2,100 మెగావాట్లకు చేరినట్లు అధికరుల గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే రెండేళ్లలో మరిన్ని ఎత్తిపోతల పథకాలు పూర్తి కానుండగా, వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు.

మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్‌లో భారీగా
యాసంగి పంటలు కోతకు వచ్చినా విద్యుత్‌ వినియోగం ఆగడం లేదు. గురు, శుక్రవారాల్లోనూ గతేడాది ఇదే సమయంతో పోలిస్తే విద్యుత్‌ గణనీయంగా వినియోగమైంది. ఎన్పీడీసీఎల్‌ పరిధిలో గత ఏడాది 2,584 మెగావాట్లు కాగా, ఇప్పుడు 3,081 మెగావాట్లుగా, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో గతేడాది ఇదే సమయంలో 4,575 మెగావాట్లు కాగా, శుక్రవారం 6,665 మెగావాట్లు విద్యుత్‌ వినియోగం నమోదైంది. ఈ రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థల పరిధిలోని పూర్వ కరీంనగర్‌ జిల్లాలో 1,029 మెగావాట్లు వినియోగం కాగా, ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని మెదక్‌లో 1,443, మహబూబ్‌నగర్‌లో 1,126 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top