దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం అవసరం

Telangana Minister KTR Speech At Graduation Ceremony Of Mahindra University - Sakshi

మహీంద్రా వర్సిటీ స్నాతకోత్సవంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌/సుభాష్‌నగర్‌: దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన మహీంద్రా విశ్వవిద్యాలయం ప్రథమ వార్షిక స్నాతకోత్సవంలో మంత్రి ప్రసంగించారు. ఆవిష్కరణల్లో యువత చాలా చురుకుగా ఉందనికొనియాడారు.

ప్రపంచమంతా వయోభారంతో కుంగుతుంటే, భారత్‌ మాత్రం నవయవ్వన దేశంగా మారుతోందన్నారు. వినూత్నమైన ఆలోచనలు, శక్తిని చాటడానికి యువతరం ఉవ్విళ్లూరుతోందని పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్న వేళ దేశ భవిష్యత్‌ గురించి ఆలోచించాల్సిన అవసరమూ ఉందని కేటీఆర్‌ అన్నారు. కాలేజీ నుంచి అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యువత బయటకు వచ్చి సమాజ శ్రేయస్సుకు తమవంతు తోడ్పాటునందించి మరోమారు చేంజ్‌ మేకర్స్‌గా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అభివృద్ధిలో దేశానికే తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. వర్సిటీ చాన్సలర్‌ ఆనంద్‌ మహీంద్రా మాట్లాడుతూ ‘‘ఇంటర్‌ డిసిప్లి్లనరీ విద్య అనేది సైన్స్, హ్యుమానిటీస్‌ను మిళితం చేసి హోల్‌ బ్రెయిన్‌ థింకింగ్‌ను వేగవంతం చేస్తుంది. ఈ తరహా భావి విద్యకు అంతర్జాతీయ కేంద్రంగా ఇండియా నిలిచే సామర్థ్యం ఉంది’’అని అన్నారు. కార్పొరేట్‌ సెక్టార్‌తోపాటు దేశానికి స్కిల్‌ డెవలప్‌మెంట్, టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ చాలా కీలకమని మహీంద్రా విద్యాసంస్థల చైర్మన్‌ వినీత్‌ నయ్యర్‌ అభిప్రాయపడ్డారు.

టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో గుర్నానీ మాట్లాడుతూ డిజిటలైజేషన్‌తో రూపురేఖలు మారుతున్నాయని, డిజిటల్‌ టెక్నాలజీలలో నైపుణ్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగాలన్నారు. యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ యాజులు మెడూరి మాట్లాడుతూ అంతర్జాతీయ పాఠ్యాంశాలు, పరిశోధన–ఆధారిత అభ్యాసం ద్వారా గ్లోబల్‌ థింకర్స్, ఎంగేజ్డ్‌ లీడర్‌లను రూపొందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top