100 రోజుల్లో కోటిన్నర మందికి స్క్రీనింగ్‌ 

Telangana Medical And Health Department Start Kanti Velugu Programme - Sakshi

నేటి నుంచి కంటి వెలుగు 

ఖమ్మంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం.. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు 

సాక్షి, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం బుధవారం మొదలుకానుంది. ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనికోసం వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 19 నుంచి రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తారు. ఇందులో ప్రజాప్రతినిధులందరూ పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,500 కేంద్రాల్లో కంటి స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తారు. 100 పనిదినాల్లో కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. తద్వారా గిన్నిస్‌ బుక్‌లో నమోదయ్యేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. 18 ఏళ్లు నిండిన వారందరికీ పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి కళ్లద్దా్దలు ఇస్తారు. మొత్తం 55 లక్షల కళ్లద్దాలు సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఒక్కోచోట 300 మందికి, పట్టణ ప్రాంతాల్లో 400 మందిని పరీక్షించాలన్నది లక్ష్యం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరాలు నిర్వహిస్తారు.  

15 వేల మంది సిబ్బంది : కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 15 వేల మంది సిబ్బంది పాల్గొంటారు. కంటి పరీక్షలకు అవసరమైన ఏఆర్‌ యంత్రాలు, కళ్లద్దాలు సిద్ధంగా ఉంచారు. కంటి వెలుగు శిబిరాల్లో కంటి శుక్లం, మెల్ల కన్ను, టెరీజియం పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి చుక్కల మందులు, మాత్రలు ఇస్తారు. శిబిరాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top