‘మేడారం’ పనులు మొదలయ్యేదెప్పుడు?

Telangana: Medaram Sammakka Saralamma Jatara will be held On 2022 Feb 16 - Sakshi

వచ్చే ఫిబ్రవరి 16–19లలో మహాజాతర  

జనవరి నుంచే మొదలుకానున్న తాకిడి 

రూ.115 కోట్లతో ప్రతిపాదనలు.. రూ.75 కోట్లు విడుదల 

ఇంకా పూర్తికాని ‘ఈ–ప్రొక్యూర్‌మెంట్‌’టెండర్లు 

పలు ప్రాంతాల్లో గుంతలమయమైన రహదారులు 

రవాణా సౌకర్యం మెరుగుపడకుంటే తప్పని ‘వన్‌ వే’ఇక్కట్లు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ మహాసమ్మేళనంగా ఖ్యాతికెక్కిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర వచ్చే ఏడాది మాఘమాసంలో నాలుగురోజులపాటు జరగనుంది. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర నిర్వహించనున్నట్లు మేడారం ఆలయపూజారులు ఇదివరకే ప్రకటించారు. ఈ జాతరకు జనవరి నుంచే భక్తుల రద్దీ పెరగనుంది. అయితే ఆ ప్రాంతంలో భక్తులకు సౌకర్యాలు మెరుగుపర్చేవిధంగా అభివృద్ధి పనులు ఇంకా మొదలుకాలేదు.

జాతరను పురస్కరించుకొని చేపట్టాల్సిన పనుల కోసం సుమారు రూ.114.95 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం రూ.75 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ నెల 15 నాటికి టెండర్లు పూర్తిచేసి పనులు మొదలెట్టాల్సి ఉండగా, ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. 

అరకొర నిధులు.. అత్తెసరు పనులు 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ మహాజాతర అభివృద్ధికి ప్రభుత్వాలు అరకొరగా నిధులు కేటాయించి తాత్కాలిక పనులు చేపట్టాయి. స్వరాష్ట్రంలో మహాజాతర అంటే ఇలా నిధుల కేటాయిం పు ఉండాలే అనేలా.. రూ.150.50 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. మేడారం జాతర చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదు. భక్తులకు కూడా తాగునీరు, శానిటేషన్, రోడ్ల సౌకర్యాలు మెరుగుపడ్డాయి.

ఈ–ప్రొక్యూర్‌ దశలో టెండర్లు... పెండింగ్‌లో రోడ్ల పనులు 
మేడారం జాతర పేరుతో 2016, 2018, 2020లలో వివిధ ప్రాంతాలకు మంజూరైన రోడ్లు ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో వన్‌–వే ట్రాఫిక్, వాహనాల రాకపోకల విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గత ఏడాది వన్‌–వే చేసిన క్రమంలో ఏటూరునాగారం, ఖమ్మం, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలకు చెందిన ప్రైవేటు వాహనాలను కొండాయి మీదుగా మేడారం వైపు మళ్లించారు. ఈసారి ఆ రోడ్లు గుంతలమయంగా మారడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఈసారి రూ.75 కోట్ల విడుదలకు ముందు, తర్వాత ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్‌ కృష్ణఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్‌ సమీక్ష లు నిర్వహించారు. అయినా పనులన్నీ ఇంకా టెండర్ల దశ దాటకపోవడంతో అవి ఎప్పటికీ పూర్తవుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

జనవరి 15కల్లా మహాజాతర పనులు 
మేడారం జాతరకు సమయం దగ్గర పడుతున్నందున ఆయా శాఖల అధికారులు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికల నియమావళి పాటిస్తూ నడుస్తున్న పనులకు టెండర్లు పిలిచి, 2022 జనవరి 15 కల్లా అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
– కృష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్, ములుగు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top