13 నుంచి మళ్లీ ములాఖత్‌లు! 

Telangana: Government Decided To Allow Inmates In Jail To Meet Family Members - Sakshi

ఏడాదిన్నరగా జైళ్లలో ఆగిన వైనం 

కోవిడ్‌ నేపథ్యంలో ఆపిన అధికారులు 

ఇప్పుడు టీకా 2 డోసులు వేసుకున్న వారికి అనుమతి 

సాక్షి, హైదరాబాద్‌: జైళ్లలోని ఖైదీలను, నిందితులను కలవడానికి కుటుంబ సభ్యులు, బంధువులకు తిరిగి అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌ కారణంగా ఆగిన ములాఖత్‌లను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సోమవారం నుంచి ఈ ములాఖత్‌లు ప్రారంభం అవుతాయని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. అయితే కోవిడ్‌ ఉధృతి పూర్తిగా తగ్గనందున.. కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారినే జైళ్లలో ఉన్న వారిని కలవడానికి అనుమతించాలన్న నిబంధన విధించారు.

కోవిడ్‌ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గత సంవత్సరం మార్చి 23 నుంచి ఈ ములాఖత్‌లను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జైళ్లలో ఉన్న తమవారిని కలిసేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ క్రమంలో కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిమాండ్, శిక్షపడ్డ ఖైదీల ములాఖత్‌కు సంబంధించి తొమ్మిది అంశాలతో కూడిన నిబంధనలు విధించింది. కోవిడ్‌ సమయం కావడంతో ములాఖత్‌కు కుటుంబసభ్యులను మాత్రమే అనుమతించాలని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. 

రిమాండ్‌లో ఉన్న ముద్దాయికి వారానికి ఒకసారి ములాఖత్‌. 
శిక్ష పడ్డ నిందితునికి 15 రోజుల్లో ఒకసారి. 
కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులు, భార్య/ భర్త, పిల్లలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు మాత్రమే అనుమతి. 
ములాఖత్‌ల సమయంలో సామాజిక దూరం, మాస్క్, శానిటైజేషన్‌ తప్పనిసరి. 
టీకా రెండు డోసులు తీసుకున్నట్లు ధ్రువీకర ణ పత్రం..తినుబండారాలకు అనుమతి లేదు.  
ముద్దాయికి ఒక జత బట్టలకు అనుమతి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top