
శంషాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర సర్కారు మార్కెట్‌లో చేపలను విక్రయించినట్లుగా అమ్మేస్తోంద ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా 23 సంస్థలను విక్రయించిందన్నారు. సెప్టెంబరు 4 నుంచి 7 వరకు శంషాబాద్‌లో నిర్వహించనున్న పార్టీ రాష్ట్ర 3వ మహాసభల సన్నాహాక సమావేశానికి మంగళవారం ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తుక్కుగూడ సభకు హాజరైన రోజే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని కేంద్రం ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిందన్నారు. రాష్ట్ర సర్కారు దానిని తెరిపించేందుకు సన్నాహాలు చేస్తుంటే, కేంద్రం విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోందని మండిపడ్డారు. అక్టోబరు 14 నుంచి 18 వరకు విజయవాడలో పార్టీ జాతీయ మహాసభలు జరగనున్నాయని, ముందస్తుగా అన్ని రాష్ట్రాల్లో మహాసభలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, పి.జంగయ్య, నర్సింగ్‌రావు, అఫ్సర్ తదితరులున్నారు.