ధరలు తగ్గించాలి.. ధాన్యం కొనాలి 

Telangana Congress Holds Statewide Protest Against Price Rise - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళన కార్యక్రమాలు  

సాక్షి, నెట్‌వర్క్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ చార్జీల్ని తగ్గించాలని, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయా లనే డిమాండ్లతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కలెక్టరేట్ల ఎదుట, నియోజకవర్గ కేంద్రాల్లోనూ ధర్నా, రాస్తారోకోలు నిర్వహించాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ కాంగ్రెస్‌ నాయకులు నిరసన దీక్షలు నిర్వహించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు శనిలా దాపురించారన్నారు. మహబూబాబాద్‌లో బెల్లయ్యనాయక్, ఖమ్మంలో పీసీసీ ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్, ఇల్లెందులో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొని నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్‌ నాయకులు ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు.


నిర్మల్‌ కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన నాయకులు  

సంగారెడ్డిలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆదిలాబాద్, నిర్మల్‌ కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు బైఠాయించగా, ఏఐసీసీ నేత మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డిలో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం గ్యాస్‌బండకు దండవేసి ప్రధాన రహదారిపై వంటావార్పు చేసి నిరసన తెలిపారు. కాగా, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించడంతో పాటు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చే క్రమంలో పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలు చేపట్టింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top