అడవి కబ్జాపై ఆకాశరామన్న ఉత్తరాలు రాయండి | Telangana Committed To Find Permanent Solution For Podu Land Issue: KTR | Sakshi
Sakshi News home page

అడవి కబ్జాపై ఆకాశరామన్న ఉత్తరాలు రాయండి

Nov 7 2021 12:35 AM | Updated on Nov 7 2021 7:32 AM

Telangana Committed To Find Permanent Solution For Podu Land Issue: KTR - Sakshi

సిరిసిల్ల కలెక్టరేట్‌లో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌ 

సిరిసిల్ల: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిపాటు డిజిటల్‌ భూసర్వేలు నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో శనివారం పోడుభూములపై అఖిలపక్ష నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్రవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అడవిని.. పుడమిని కాపాడేందుకు నవంబర్‌ 8వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో అర్జీలు స్వీకరిస్తున్నామని, వాటిని పరిశీలించి శాస్త్రీయంగా గూగుల్‌ మ్యాప్స్‌తో విశ్లేషించి అర్హులకు పట్టాలిస్తామని తెలిపారు. మళ్లీ అడవుల జోలికి వెళ్లకుండా కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ కృషితో హరితహారంలో అగ్రస్థానంలో ఉన్నామని, నాలుగున్నర శాతం అడవి పెరిగిందని అన్నారు.

‘ధరణి’తో అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని, ఇప్పటికే 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు. ధరణితో నేరుగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని, రెవెన్యూ అవినీతి తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు. దేశం మొత్తంగా ధరణిని అనుసరించే రోజులు వస్తాయన్నారు.  

అక్షాంశాలు.. రేఖాంశాలతో సర్వే 
అక్షాంశాలు.. రేఖాంశాల ఆధారంగా సంపూర్ణ డిజిటల్‌ భూసర్వే చేయిస్తామని కేటీఆర్‌ అన్నారు. ఇది పూర్తయితే భూముల హద్దులు, వాటి యజమానుల వివరాలు పక్కాగా నమోదవుతాయని తెలిపారు. అంతకంటే ముందు 2005 నాటి రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూముల చట్టం ఆధారంగా భూమిని నమ్ముకున్న గిరిజనుల్లో అర్హులకు పారదర్శకంగా పట్టాలిస్తామన్నారు.

ఇందులోనూ ఎవరైనా పైరవీలు చేసినా, అనర్హులకు అండగా ఉన్నా జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించారు. ఎవరైనా అటవీ భూములను కబ్జా చేస్తే వెంటనే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయాలని, ఆకాశరామన్న ఉత్తరం రాసినా.. సరిపోతుందని మంత్రి వివరించారు. అడవులను నరికివేసే వారిపై కఠినంగా ఉంటామన్నారు.  

ఢిల్లీకి అఖిలపక్ష బృందం 
అటవీ భూములను ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు పట్టాలిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టమే ప్రతిబంధకంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ చట్ట సవరణకు సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్తానని చెప్పారని వివరించారు. క్షేత్రస్థాయిలో అర్జీల స్వీకరణ పూర్తయిన తర్వాత సమగ్ర సమాచారంతో మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

భవిష్యత్‌లో అటవీభూములను ఆక్రమించబోమని, ఎవరైనా కబ్జా చేసినా సహించబోమని అఖిల పక్షనేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్‌బాబు, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement