మార్కులు కొంచెం మెరుగు | Sakshi
Sakshi News home page

మార్కులు కొంచెం మెరుగు

Published Tue, Feb 7 2023 3:04 AM

Telangana Budget 2023: Rs 19, 093 Crores Allocated For Education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌లో ఈసారి చదివింపులు పెరిగాయి. అక్షరాలా రూ.19,093 కోట్లు కేటాయించారు. గతేడాది (2022–23) రూ.16,043 కోట్లు ఉండగా, ఈ ఏడా ది రూ.3,050 కోట్ల మేర పెరిగాయి. పాఠశాల విద్యకు రూ.16,092 కోట్లు ఇవ్వగా, ఉన్నతవిద్యకు రూ.3,001 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో చాలావరకూ ఉద్యోగుల వేతనాలు, సంస్థల నిర్వాహణకే సరిపోతుంది. ఈ ఏడాది పాఠశాల విద్యాశాఖలో పదోన్నతులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

దీంతో ప్రమోషన్లు పొందే ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయి. ఇప్పటికే ఉన్న ఖాళీలు, పదోన్నతుల వల్ల ఏర్పడే ఖాళీలు కలుపుకుని పాఠశాలవిద్యలో దాదాపు 18 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన నిధుల అంశాన్ని బడ్జెట్‌లో ఎక్కడా పేర్కొనలేదు. ఉన్నతవిద్యకు అత్తెసరుగానే నిధులు కేటాయించారు.

సాంకేతిక, కళాశాల విద్యకు నిధులు తగ్గాయి. యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు, గతేడాది ప్రకటించిన మహిళావర్సిటీకి కలిపి రూ.600 కోట్లు కేటాయించారు. గతేడాది మహిళావర్సిటీకి రూ.వంద కోట్లు కేటాయించినా, అవి ఖర్చవ్వలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘మన ఊరు–మనబడి’పథకానికి ప్రణాళికేతర పద్దుల్లో నిధులు ఖర్చుచేయాలని నిర్ణయించారు.

కొన్ని ముఖ్యాంశాలు 
ఆంగ్ల మాధ్యమాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాల ముద్రణకు నిధులు పెంచారు. పాఠశాల విద్యలో గతంలో రూ.32.07 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ. 73.07 కోట్లకు పెంచారు.  

►కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో నిర్వహించే సమగ్ర శిక్షా అభియాన్‌కు రాష్ట్రవాటాను రూ.799.91 కోట్ల నుంచి రూ.1,100 కోట్లకు పెంచారు. 

►అసంపూర్తిగా ఉన్న మోడల్‌ స్కూల్‌ భవన నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చి నిధులను రూ.2.66 కోట్ల నుంచి రూ.6.68 కోట్లకు పెంచారు. 

►ప్రధానమంత్రి పోషక్‌ (మధ్యాహ్న భోజనం) పథకానికి రాష్ట్రవాటాను రూ.2.66 కోట్ల నుంచి రూ.6.68 కోట్లకు పెంచారు. 

►కళాశాల విద్యలో భవన నిర్మాణాల నిర్వహణకు గతేడాది రూ.62.27 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.42.34 కోట్లకు తగ్గించారు. 

►ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాల ముద్రణకు గతంలో మాదిరిగానే రూ. 1.59 కోట్లే కేటాయించారు. అదనపు నిధుల ప్రతిపాదనకు మోక్షం దక్కలేదు. 

►ఇంటర్‌విద్య కేటాయింపులు గతేడాదితో పోలిస్తే రూ.34.60 నుంచి 13.13 కోట్లకు తగ్గాయి.  

పురోగతికి విఘాతమే.. విద్యా రంగానికి 6.75% నిధులే కేటాయించడం పురోగతికి విఘాతమే. ఉమ్మడి ఏపీ 11%, ఢిల్లీ 23%, బిహార్‌ 18%, రాజస్తాన్‌ 17% నిధులు కేటాయించాయి. 
–  చావా రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఎస్‌ యూటీఎఫ్‌  

Advertisement
Advertisement