పెంచిన కరెంట్‌ చార్జీలపై ‘ప్రజాబ్యాలెట్‌ 

Telangana BJP Likely To Be Held Protest Over Electricity Charges Hike - Sakshi

తొలుత సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నా, తర్వాత కలెక్టరేట్ల ముట్టడికి బీజేపీ నిర్ణయం 

వచ్చే నెల కొత్త కరెంట్‌ బిల్లుల షాక్‌ తెలిసే నాటికి ‘చలో హైదరాబాద్‌’ 

సాక్షి, హైదరాబాద్‌: పెంచిన కరెంటు చార్జీలపై బీజేపీ ఉద్యమహోరు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ప్రజాబ్యాలెట్‌ రూపంలో ప్రజాభిప్రాయసేకరణకు నడుంబిగించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో దీనిని ఒక ఉద్యమరూపంగా చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. గత నెల 28న హైదరాబాద్‌ జిల్లాలో బషీర్‌బాగ్‌లో ప్రయోగాత్మకంగా బ్యాలెట్‌ పత్రాలు, బాక్సులు ఏర్పాటు చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది.

కరెంట్‌ చార్జీల పెంపుదల పేరుతో ప్రజలపై రూ. 6 వేల కోట్ల భారాన్ని మోపడాన్ని సమర్థిస్తారా.. సమర్థించరా.. అనే అంశంతో కూడిన బ్యాలెట్‌పత్రంతో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దిశానిర్దేశం చేశారు. జిల్లాల అధ్యక్షులతోపాటు వివిధస్థాయిల నాయకులు, కార్యకర్తలు ‘ప్రజాబ్యాలెట్‌’లో పాల్గొననున్నారు.  

అందులో భాగంగా బస్టాండ్, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన అన్నిప్రదేశాల్లో ప్రజాబ్యాలెట్‌ శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయాన్ని కోరనున్నారు. దీనికి కొనసాగింపుగా జిల్లాల్లో తొలుత విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఎదుట, జిల్లాకేంద్రాల్లో ఆందోళనలు, ఆ తర్వాత కలెక్టరేట్ల ముట్టడికి నిర్ణయించారు. వచ్చేనెల కరెంట్‌ బిల్లులు అందాకా బిల్లుల షాక్‌ తెలిసే నాటికి ‘చలో హైదరాబాద్‌’నిర్వహించాలని పార్టీ భావిస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top