2020 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. 20 లక్షల మందికి లబ్ధి!

Telagana Govt Good News For 2020 LRS - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: లేఅవుట్‌ క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన పథకం 2020-ఎల్‌ఆర్‌ఎస్‌(LAYOUT REGULARIZATION SCHEME) దరఖాస్తులపై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్చి 31 లోగా దరఖాస్తులకు లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే అవుట్‌లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. 20 లక్షల మంది దిగువ, మధ్య తరగతి వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు మేలు కలగనుంది.

ఏమిటీ ఎల్‌ఆర్‌ఎస్‌.. 
అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిందే ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం).  ప్రభుత్వ విధివిధానాలు పాటించకుండా నిర్మించిన లే అవుట్లు, అక్రమ స్థలాల్లో నిర్మించిన లే అవుట్లను అన్ అప్రూవుడ్ లే అవుట్లు అంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఇలాంటి స్థలాలను తప్పకుండా క్రమబద్ధీకరించుకోవాలి. ఇందుకోసం 2020లో ఎల్ఆర్ఎస్-2020 (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2020) పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది. 

ఎల్‌ఆర్‌ఎస్‌ ఉద్దేశమేంటంటే..
అధికారిక లేఅవుట్‌లో పది శాతం స్థలాన్ని ఖాళీగా వదలాల్సి ఉంటుంది. కానీ.. అనధికారిక లేఅవుట్లలో ఖాళీ స్థలం ఉండదు. దీంతో జనావాసాల్లో సౌకర్యాలు సరిగా ఉండవని, అలాంటి లేఅవుట్లలోని ఇళ్ల స్థలాల నుంచి 0.14శాతం ఓపెన్‌ ల్యాండ్‌ ఛార్జీలను వసూలు చేస్తారు. ఆ డబ్బుతో కొంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి.. అనధికార లేఅవుట్‌లోని కాలనీకి కేటాయించాలన్నది ముఖ్యోద్దేశం. కానీ.. జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఆదాయ వనరుగానే చూస్తోంది. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద రూ.100కోట్లకుపైగా రుసుము వసూలు చేయగా, అందులో ఒక్క రూపాయిని కూడా ఉద్దేశించిన లక్ష్యం కోసం వెచ్చించలేదు.

ఎదురుచూపులే.. 
అయితే.. రాష్ట్రంలో లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది గత మూడున్నరేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. నగర, పురపాలికలు; పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

తాజాగా కదలిక.. 
అయితే 20లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చే.. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఔట్‌లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. మార్చి 31లోపు దరఖాస్తుదారులకు ఈ అవకాశం కల్పించనుంది. సోమవారం ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తుల్లో అర్హమైన వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top