తార్నాక జంక్షన్‌..రీ ఓపెన్‌! | Tarnaka junction to be reopened for 15 days from today | Sakshi
Sakshi News home page

తార్నాక జంక్షన్‌..రీ ఓపెన్‌!

Apr 18 2025 7:53 AM | Updated on Apr 18 2025 7:53 AM

Tarnaka junction to be reopened for 15 days from today

2015 జూలై నుంచి ‘యూ టర్న్స్‌’ అమలు 

తెరవాలని ట్రాఫిక్‌ అధికారులకు విజ్ఞప్తులు 

ప్రయోగాత్మకంగా నేటి నుంచి రాకపోకలు 

ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ట్రాఫిక్‌ విభాగం

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు దశాబ్ద కాలంగా మూతపడిన తార్నాక జంక్షన్‌ను నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఎట్టకేలకు ప్రయోగాత్మకంగా తెరవనున్నారు. శుక్రవారం నుంచి మే 2 తేదీ వరకు ఈ చౌరస్తాను ఓపెన్‌ చేయనున్నారు. ఈ మధ్యకాలంలో అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి.. ఆపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు గురువారం సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ జోయల్‌ డెవిస్‌ ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ– లాలాపేట వైపుల నుంచి రాకపోకలు సాగించడానికి గతంలో ఈ జంక్షన్‌ను వినియోగించే వాళ్లు. 

 తార్నాక ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ముందు హబ్సిగూడ–మెట్టుగూడ వైపుల నుంచి రాకపోకలు సాగించడానికీ ఈ జంక్షన్‌ ఉపకరించింది. 1990 నుంచి తార్నాక ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచి్చంది. అయితే.. తార్నాక చౌరస్తాను మాత్రం 2015 జూలై వరకు తెరిచే ఉంచారు. ఆపై మూసివేయడంతో పాటు లాలాపేట నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వైపు వెళ్లే వాహనాలు హెచ్‌ఎండీఏ కార్యాలయం వరకు వెళ్లి యూ టర్న్‌ చేసుకుని వచ్చేలా.. అలాగే యూనివర్సిటీ నుంచి లాలాపేట వైపు వెళ్లే వాహనాలు రైల్వే డిగ్రీ కళాశాల వద్ద యూ–టర్న్‌ తీసుకుని వచ్చేలా మార్పుచేర్పులు చేశారు. మెట్రో రైలు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ముందు ఈ సిగ్నల్‌ వద్దే ఒకే పోలీసు అధికారి విధులు నిర్వర్తించేవారు. 

అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఖ్య ఎనిమిదికి పెంచాల్సి వచి్చంది. దీంతో పాటు ఇతర పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు 2015లో ఈ జంక్షన్‌ను మూసేశారు.

అనేక విజ్ఞప్తుల నేపథ్యంలో నిర్ణయం... 
ఈ చౌరస్తాను మళ్లీ తెరవాలంటూ కొన్నేళ్లుగా అనేక మంది ట్రాఫిక్‌ విభాగానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు పరిస్థితులు లేవని, ట్రాఫిక్‌ జామ్స్‌ కావని చెబుతున్నారు. ఈ చౌరస్తా మూసేయడంతో ‘యూ–టర్న్‌’ కోసం దాదాపు కిలోమీటరు ముందుకు వెళ్లి, తిరిగి రావాల్సి వస్తోందని విజ్ఞప్తి చేస్తున్నారు. యూ టర్న్స్‌ కేంద్రంగా ట్రాఫిక్‌ జామ్స్‌ జరుగుతుండటాన్నీ ట్రాఫిక్‌ అధికారులు గుర్తించారు. దీంతో శుక్రవారం నుంచి ఈ జంక్షన్‌ను ప్రయోగాత్మకంగా రీ–ఓపెన్‌ చేయాలని నిర్ణయించారు. గతానికి భిన్నంగా రూట్‌ ఇస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ట్రాఫిక్‌ చీఫ్‌ జోయల్‌ డెవిస్‌ కొన్ని కీలక సూచనలు చేశారు.  
ఓయూ వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా లాలాపేట వైపు, కుడివైపు తిరిగి హబ్సిగూడ వైపు వెళ్లే అవకాశం ఉంది. 
  లాలాపేట వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఓయూ వైపు వెళ్లడానికి, కుడి వైపు తిరిగి మెట్టుగూడ వైపు రావడానికి అవకాశం ఉంది.  
 మెట్టుగూడ వైపు నుంచి వచ్చే వాహనాలు మాత్రం ఈ చౌరస్తా వద్ద కుడివైపు తిరిగి ఓయూ వైపు వెళ్లే అవకాశం లేదు. నేరుగా హెచ్‌ఎండీఏ కార్యాలయం వరకు వెళ్లి, యూ టర్న్‌ తీసుకుని వచి్చ, చౌరస్తా వద్ద ఎడమ వైపు తిరిగి ఓయూ రూట్‌లోకి వెళ్లాలి. 
హబ్సిగూడ వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా తార్నాక జంక్షన్‌ వద్ద కుడి వైపు తిరిగి లాలాపేట వైపు వెళ్లే అవకాశం లేదు. ఈ వాహనాలు ఎడమ వైపు తిరిగి, రైల్వే డిగ్రీ కాలేజీ వరకు వెళ్లి యూ టర్న్‌ తీసుకోవాలి. ఆపై చౌరస్తా వరకు వచ్చి ఎడమ వైపు తిరిగి లాలాపేట వైపు వెళ్లాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement