‘కంచ’లోనే లోపలేస్తాం! | Supreme Court Fires On Telangana Govt About Kancha Gachibowli Lands | Sakshi
Sakshi News home page

‘కంచ’లోనే లోపలేస్తాం!

Published Thu, Apr 17 2025 1:05 AM | Last Updated on Thu, Apr 17 2025 6:52 AM

Supreme Court Fires On Telangana Govt About Kancha Gachibowli Lands

కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా? లేదా?

ఒకవేళ తీసుకోకుంటే అక్కడే తాత్కాలిక జైలుకట్టి అధికారులను 6 నెలలు జైలుకు పంపుతాం

ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం 

1996 నాటి తమ తీర్పునకు భిన్నంగా ప్రవర్తించిన అధికారులంతా బాధ్యులవుతారని హెచ్చరిక 

సీఎస్‌ను తీవ్ర చర్యల నుంచి కాపాడాలనుకుంటే పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ఆదేశం 

ఫేక్‌ వీడియోలు సర్క్యులేట్‌ చేశారన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం 

వందలకొద్దీ బుల్డోజర్ల వల్ల జంతువులు భయభ్రాంతులకు గురయ్యాయని వెల్లడి 

పరుగులు తీసిన వాటిని కుక్కలు కరిచిన వీడియోలు చూసి చలించిపోయామని వ్యాఖ్య 

భూములపై యథాతథ స్థితి కొనసాగింపు.. తదుపరి విచారణ మే 15కు వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: ‘అభివృద్ధి పేరుతో మూడు రోజుల్లోనే వందల బుల్డోజర్లను ఉపయోగించి 100 ఎకరాల్లో చెట్లను తొలగించారు. చెట్ల నరికివేతను ఏ రకంగానూ సమర్ధించుకోవాలని చూడొద్దు. చెట్ల నరికివేతకు అసలు అనుమతులు తీసుకున్నారా లేదా? ఈ ప్రశ్నకు మాకు సూటిగా సమాధానం చెప్పండి. ఒకవేళ అనుమతులు తీసుకోకపోయి ఉంటే మాత్రం అందుకు బాధ్యులైన అధికారులందరినీ జైలుకు పంపుతాం. 

వారి కోసం అదే ప్రాంతంలో తాత్కాలిక జైలు నిర్మించి మరీ ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ కంచ గచ్చిబౌలి భూముల కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ జార్జ్‌ అగస్టీన్‌ మసీలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో 1996లో తామిచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులే బాధ్యులవుతారనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది. 

వంద ఎకరాల్లో అటవీ సంరక్షణ కోసం చట్టప్రకారం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఆదేశించింది. తాము చేపట్టబోయే తీవ్ర చర్యల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఇతర కార్యదర్శులను కాపాడాలనుకుంటే 100 ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తేల్చిచెప్పింది. పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికతోనే మా ముందుకు రావాలని స్పష్టం చేసింది. 

కంచ గచ్చిబౌలి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సుమారు అరగంటపాటు సాగిన వాదనల అనంతరం కేసు విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటివరకు స్టేటస్‌ కో కొనసాగుతుందని తెలిపింది. చెట్ల తొలగింపుపై తమ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ (సీఈసీ) సమర్పించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు ఇచ్చింది. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, ‘బీ ద ఛేంజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ’పిటిషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషన్‌ తరఫున ఎస్‌.నిరంజన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. 

అభివృద్ధి చేసేందుకే.. 
అంతకుముందు అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు ప్రారంభిస్తూ అన్ని అనుమతులతోనే ఆ భూముల్లో చెట్లను (పొదలు) తొలగించామన్నారు. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా అని ఈ సందర్భంగా ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. తెలంగాణలో వాటర్‌ అండ్‌ ట్రీ (వాల్టా) యాక్ట్‌ ఉందంటూ అమికస్‌ క్యూరీ పరమేశ్వర్‌ జోక్యం చేసుకొని ధర్మాసనానికి వివరించగా ఈ చట్టం కింద అనుమతులు తీసుకోకుంటే అందరిపై చర్యలు తీసుకుంటామని ధర్మాసనం బదులిచ్చింది. 

ఆ భూములను రూ. 10 వేల కోట్లకు తనఖాపెట్టి ప్రభుత్వం అప్పు తెచ్చుకుందని అమికస్‌ క్యూరీ పేర్కొనగా ఆయన వ్యాఖ్యలను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఆ భూములను మార్టిగేజ్‌ చేశారా లేదా అమ్ముకున్నారా అనేది మాకు అనవసరం. అక్కడ చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? లేదా అనేది మాత్రమే మాకు సూటిగా జవాబు చెప్పండి’అంటూ సింఘ్వీని ప్రశ్నించింది. 

ఆ ప్రాంతంలో కొన్ని షెడ్యూల్డ్‌ జంతువులు ఉన్నాయని.. అక్కడ పనులు జరిగేటప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని ‘బీ ద ఛేంజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ’తరుఫు సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, మోహిత్‌రావులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో జేసీబీలు ఉన్నాయని చెప్పారు. 



హెచ్‌సీయూకు 25 వేల ఎకరాల భూమి ఉందని.. అందులో 400 ఎకరాల భూవివాదం 2004 నుంచి కొనసాగుతోందని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. దీనికి సంబంధించి కోర్టు తీర్పులు, 20 ఏళ్లలో ఆ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. ఈ స్థలంలో ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మందికి జీవనోపాధి, ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు చెప్పారు. సీఎస్‌ ఒక మహిళ అని, ఆమె నెల రోజుల్లో రిటైరవనున్నారని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. 

జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? 
ఈ సందర్భంగా ధర్మాసనం మళ్లీ స్పందిస్తూ ‘మేం పదేపదే చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అని అడుగుతున్నాం. ఈ ప్రశ్నకు మాకు సూటిగా మీ సమాధానం కావాలి’అంటూ వ్యాఖ్యానించింది. ‘సీఎస్‌ నెల రోజుల్లో రిటైరవుతున్నారంటే ఎలా సింఘ్వీజీ? ఆ ప్రాంతంలో జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? రాష్ట్రంలో జరుగుతున్న విషయాలకు సీఎస్‌ బాధ్యత వహించాలి కదా?’అంటూ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రశ్నించారు. ‘అడవి అనే పదానికి నిర్వచనం ఇస్తూ 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా చెట్ల నరికివేత జరిగి ఉంటే మాత్రం మేం ఊపేక్షించం. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకోవాలనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అంటూ ధర్మాసనం నిలదీసింది. 

మహానగరాల్లో అటవీభూముల్లో కాపాడుకోకపోతే ఎలా? 
‘చార్‌ధామ్‌ యాత్ర కోసం రోడ్డు నిర్మాణానికి చెట్లు తొలగిస్తామంటేనే మేం అనుమతించలేదు. మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కోసం పర్యావరణానికి నష్టం కలిగించిన కేసు రెండు దశబ్దాలుగా సుప్రీంకోర్టులోనే పెండింగ్‌లో ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ముంబై, చెన్నై, హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లోని అటవీ భూముల్ని కూడా కాపాడుకోలేకపోతే ఎలా? అంటూ ప్రశ్నలు సంధించింది. మంత్రులు ఏది చెబితే అధికారులు అది చేసేస్తున్నారంటూ అమికస్‌ క్యూరీ పరమేశ్వర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా ‘పర్యావరణానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను జైళ్లకు పంపించాల్సి వస్తుంది జాగ్రత్త. 

చెట్లను కొట్టేసిన దగ్గరే తాత్కాలిక జైలు నిర్మిస్తాం. సంబంధిత అధికారులను అదే జైలులో 6 నెలలపాటు ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారు? చెట్లు కొట్టేసిన ప్రాంతంలో పర్యావరణ పునరుద్ధరణ కోసం తీసుకున్న చర్యలేంటి? ఆ భూముల్లో వన్యప్రాణుల్ని ఎలా రక్షిస్తారు? అక్కడి నష్టాన్ని ఎలా పూడుస్తారు?’అంటూ సింఘ్వీపై ధర్మాసనం ప్రశ్నలవర్షం కురిపించింది.  

విధ్వంసం చేస్తే ప్రేక్షక పాత్ర పోషించాలా? 
ఆ ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధపడిందని.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నందునే ఆ ప్రాంతమంతా దట్టమైన పొదలతో అడవిలా తయారైందని సింఘ్వీ వాదించారు. ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి ఎందరో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనుందని ధర్మాసనానికి చెప్పారు. 

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘అభివృద్ధి, ఉద్యోగాల కల్పన పేరుతో మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే మేం ప్రేక్షకపాత్ర పోషించాలా?. మీకు మీరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమిటి? మూడు రోజుల్లో 100 ఎకరాలు ధ్వంసం చేశారంటే ఎన్ని బుల్డోజర్లు అక్కడ ఉన్నట్లు? మీరు సృష్టించిన రణరంగానికి అక్కడి జంతువులు ప్రాణభయంతో పరుగులు తీయగా వాటిని కుక్కలు కరిచాయి. 

ఆ వీడియోలను చూసి చలించిపోయాం’అని పేర్కొంది. అయితే ఆ భూముల్లో జంతువులు లేవని.. కావాలనే కొందరు నకిలీ వీడియోలు సర్క్యులేట్‌ చేశారని సింఘ్వీ బుదులివ్వగా ధర్మాసనం ఆక్షేపించింది. అక్కడ జంతువులు పరుగులు తీసిన వీడియోలను తాము చూసి చలించిపోయమని తెలిపింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని సింఘ్వీ ధర్మాసనానికి బదులిచ్చారు. దీనిపై తదుపరి విచారణను ధర్మాసనం మే 15కు వాయిదా వేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement