
ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ కీలక భేటీ
రహస్య ఓటింగ్‌పై వ్యూహరచన.. ప్రత్యేక సూచనలు
ఇతర పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టాలని దిశానిర్దేశం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఢిల్లీలో రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యరి్థ, తెలుగుబిడ్డ జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చలు జరిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు రేవంత్‌రెడ్డి క్షుణ్ణంగా దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా, ఇది రహస్య ఓటింగ్ పద్ధతిలో జరిగే ఎన్నిక కాబట్టి, దీనిని ఇండియా కూటమికి అనుకూలంగా ఎలా మలచుకోవాలనే దానిపై ప్రధానంగా చర్చించారు. మిగతా పారీ్టల ఎంపీలతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని కోరుతూ ఎవరెవరితో సంప్రదింపులు జరపాలి అనే అంశాలపై సీఎం ఎంపీలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది.
రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన అభ్యరి్థగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయడం చారిత్రక అవసరమని, ఈ విషయాన్ని ఇతర పార్టీల ఎంపీలకు కూడా నొక్కిచెప్పాలని సూచించారు. తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకునేలా ఎంపీలందరూ సమష్టిగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. మంగళవారం జరిగే పోలింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఎంపీలకు స్పష్టం చేశారు.
రెండు రోజులు ఢిల్లీలోనే సీఎం..
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలను పర్యవేక్షిస్తారు. వీలును బట్టి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించేందుకు ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్‌మెంట్‌ను అడిగినట్టు తెలిసింది. ప్రధాని అపాయింట్‌మెంట్ లభిస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి కూడా సీఎం మాట్లాడే అవకాశముందని సమాచారం. మరోవైపు టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీల సమర భేరి సభకు ఏఐసీసీ పెద్దలను రేవంత్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది.