
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రైతాంగానికి ఊరట లభించింది. 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం కేటాయించింది. గుజరాత్, కర్ణాటక నుంచి యూరియా తరలింపునకు కేంద్రం ఆదేశించింది. వారం రోజుల్లో తెలంగాణకు యూరియా రానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. మంగళవారం కలిశారు.
కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపీలు.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వారంలో 50 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి ఇస్తానని కేంద్రం హామీ ఇచ్చిందని ఎంపీ చామల కిరణ్‌రెడ్డి వెల్లడించారు. 14 వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి పంపినట్లు కేంద్రం తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రానికి 14 వేలు మెట్రిక్ టన్నులు యూరియా వస్తుంది.
..వారం రోజుల్లో 48 వేల మెట్రిక్ టన్నులు యూరియా ఇస్తామన్నారు. వారం రోజులుగా యూరియా కోసం ఎంపీలంతా పోరాడుతున్నాం. పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం కూడా ప్రతిపాదించాం. యూరియా కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నేరుగా కేంద్ర మంత్రి నడ్డాను కలిశారు. ఎంపీలం కూడా పలుమార్లు నడ్డాను కలిశాం. మేము పలుమార్లు మంత్రిని కలవడం వల్లనే యూరియా ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది’’ అని చామల కిరణ్‌రెడ్డి తెలిపారు.