
న్యూఢిల్లీ, సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ విచారణ జరగనుంది. ఈ భూముల్లో జరుగుతున్న అన్ని కార్యాకలాపాలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ధర్మాసనం ఇంతకుముందు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 16లోపు(ఇవాళ) అఫిడవిట్ సమర్పించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు ఎంపవర్డ్ కమిటీని ఆదేశించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగానే..
తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ‘‘కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగానే హెచ్‌సీయూ భూముల్లోని పక్షులు ఇక్కడికి వచ్చాయి’’ అని కౌంటర్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.
మరోవైపు.. సుప్రీం కోర్టు ఆదేశాలనుసారం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన కేంద్ర సాధికార కమిటీ(సీఈసీ) నివేదికను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణ నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ శాంతికుమారి( CS Shanti Kumari), తెలంగాణ పీసీసీఎఫ్ డోబ్రియాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్, సీఈసీ దాఖలుచేసిన నివేదికను పరిశీలించిన తర్వాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత’’
గత వాదనల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయిన జస్టిస్ గవాయ్