ఐపీఎస్‌ కేడర్‌ పోస్టులు పెరిగేనా?  | State Government Has Appealed To The Central Govt For IPS Posts | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ కేడర్‌ పోస్టులు పెరిగేనా? 

Nov 1 2021 3:29 AM | Updated on Nov 1 2021 3:29 AM

State Government Has Appealed To The Central Govt For IPS Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నూతన జిల్లాలకు తగ్గట్టుగా ఐపీఎస్‌ కేడర్‌ పోస్టులు పెంచాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత నెలలో ప్రతిపాదనలకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. రాష్ట్ర విభజనలో భాగంగా ఐపీఎస్‌ పోస్టుల పంపకాల్లో తెలంగాణకు 112 పోస్టులు కేటాయించారు.

అయితే ఈ పోస్టులు సరిపోవని, అధికారులు ఎక్కువగా ఉండటం వల్ల తమకు మరిన్ని పోస్టులు అవసరం ఉందని 2015లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో మరో 27 కేడర్‌ పోస్టులు పెంచింది. మొత్తంగా 139 కేడర్‌ పోస్టులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయి. అయితే కొత్త జిల్లాలతోపాటు కొత్త జోనల్‌ వ్యవస్థ రావడంతో మరో 26 పోస్టులు మంజూరు చేయాలని కోరింది.  

కేడర్‌ మార్పుతో... 
ప్రస్తుతం ఏపీలో ఉన్న కొంతమంది ఐపీఎస్‌ అధికారులు తమను తెలంగాణ కేడర్‌కు పంపాలని న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ముగ్గురు ఐపీఎస్‌లకు కేడర్‌ మార్పు జరిగినట్టు తెలిసింది. అందులోభాగంగానే ఎస్పీ హోదాలో ఉన్న అభిషేక్‌ మహంతి తెలంగాణ పోలీస్‌ శాఖకు వచ్చి రిపోర్ట్‌ చేశారు. అలాగే, మరో ఇద్దరు సీని యర్‌ ఐపీఎస్‌లకు సైతం కేడర్‌ మార్పుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టు పోలీస్‌ శాఖలో చర్చ జరుగుతోంది.

దీంతో తెలంగాణ పోలీస్‌శాఖ ఆందోళనలో పడ్డట్టు తెలుస్తోంది. వీరేకాకుండా మరో ముగ్గురు అధికారులు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు. కేడర్‌ పోస్టులు తక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అధికారులకు ఎలా వెసులుబాటు చేయాలన్న అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారని తెలిసింది. 

పదోన్నతితో అవి కూడా ఖాళీ... 
రాష్ట్ర ఐపీఎస్‌ కేడర్‌ పోస్టులు మొత్తం 139 కాగా, ప్రస్తుతం 106 మంది పనిచేస్తున్నారు. ఖాళీగా ఉన్న 33లో 26 పోస్టులు రాష్ట్ర కేడర్‌ అధికారులకు ఐపీఎస్‌గా పదోన్నతి కల్పించి భర్తీ చేయనున్నారు. ఇక మిగిలింది 7 పోస్టులు మాత్రమే కాగా కేడర్‌ మార్పుతో వస్తున్న అధికారులను ఈ పోస్టుల్లో నియమిస్తే కొత్తగా ఏర్పాటు కానున్న ఏడు రేంజుల్లో ఎలా నియమించాలన్న దానిపై సంశయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రమోటీ అధికారులు పదవీ విరమణ పొందితేనే వారి స్థానంలో స్టేట్‌ కేడర్‌ అధికారులకు ఐపీఎస్‌లుగా పదోన్నతి కల్పించాల్సి ఉంటుంది.

అయితే మరిన్ని కేడర్‌ పోస్టుల మంజూరు జరిగితేనే ప్రమోటీ అధికారులకు ఐపీఎస్‌ పదోన్నతులు కల్పించే వెసులుబాటు ఉంటుందని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తమ కేడర్‌ మార్చుకుంటున్న అధికారులతోపాటు రాష్ట్ర సర్వీస్‌ అధికారులకు న్యాయం చేయాలంటే కేడర్‌ పోస్టుల పెంపు ఒక్కటే మార్గమని సీనియర్‌ ఐపీఎస్‌లు అభిప్రాయపడ్డారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయాలని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement