వైభవంగా శ్రీ మహా పోచమ్మ అమ్మవారి గంగ నీళ్ల జాతర | SP Janaki Sharmila Performs Traditional Ritual at Maha Pochamma Jathara | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీ మహా పోచమ్మ అమ్మవారి గంగ నీళ్ల జాతర

Sep 28 2025 7:36 PM | Updated on Sep 28 2025 10:10 PM

SP Janaki Sharmila Performs Traditional Ritual at Maha Pochamma Jathara

సాక్షి, జగిత్యాల: సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో గల శ్రీ మహా పోచమ్మ అమ్మవారి గంగ నీళ్ల జాతర  అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి ఆభరణాలను యాకర్పల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల దర్శించుకుని, సాంప్రదాయ ప్రకారం స్వయంగా ఎత్తుకునీ ఐదడుగులు వేయడం జరిగింది. అమ్మవారు సారంగాపూర్  గ్రామంలో  ఎంటర్ అయ్యే ముందు ఎస్పీ ఆభరణాలు ఎత్తుకోవడం సంప్రదాయంగా వస్తుంది. జాతర సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో వారి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు రోజులపాటు జరిగిన గంగనీళ్ల జాతర ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల  పేర్కొన్నారు.

అడెల్లి మహాపోచమ్మ ఆలయం గంగనీళ్ల జాతరకు ముస్తాబైంది. ప్రతి ఆదివారం అమ్మను భక్తులు కొలుస్తున్నప్పటికీ ఏడాదికోసారి జరిగే ఈ గంగనీళ్ల జాతర ఉత్సవాలు ప్రత్యేకమని చెప్పాలి. మహాలయ అమావాస్య తదుపరి వచ్చే శని, ఆదివారాల్లో ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీ వస్తుంది. ఈ నెల 27, 28 తేదీల్లో గంగనీళ్ల జాతరను నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్తల మండలితో పాటు దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న అడెల్లి గ్రామంలోని సేవాదారుల ఇంటి నుంచి అమ్మవారి ఆభరణాలు, వెండి కడవతో గోదావరికి పాదయాత్రగా పయనమవడంతో జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 

వేలాది మంది భక్తులు అమ్మవారి ఆభరణాలను అనుకరిస్తూ అడెల్లి, సారంగాపూర్, యాకర్పల్లి, వంజర్, ప్యారమూర్ మీదుగా దిలావర్పూర్ మండలంలోని కదిలి, మాటేగాం, దిలావర్పూర్, బన్సపెల్లి, కంజర్, సాంగ్వి నుంచి సాయంత్రం గోదావరి తీరానికి చేరుకున్నారు.. అక్కడే రాత్రి జాగరణ చేసిన తిరిగి ఆదివారం వేకువజామున ఆభరణాలను పవిత్ర గోదావరిలో నీటితో శుద్ది చేశారు. తిరిగి అవే గ్రామాల మీదుగా రాత్రికి అడెల్లి ఆలయానికి చేరుకొని ప్రత్యేక వెండి కడవలో తీసుకొచ్చి గోదావరి నీటిని స్థానిక కోనేటి నీటితో కలిపి అమ్మవారికి జలాభిషేకం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్గింది. 

ప్రతీ ఏటా జరిగే ఈ జాతరకు నిర్మల్ జిల్లా ప్రాంతవాసులే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్, పక్కనే ఉన్న మహరాష్ట్ర ప్రాంత వాసులు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.  గంగనీళ్ల జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసులు భారీ బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement