ఇంటి దొంగలు ఎందరు? 42 మంది టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకు నోటీసులు

SIT to investigate leak of question papers - Sakshi

ప్రశ్నపత్రాల లీక్‌పై సిట్‌ ముమ్మర దర్యాప్తు 

ఐదోరోజు 7 గంటలు సాగిన నిందితుల విచారణ 

నేటితో ముగియనున్న 9 మంది కస్టడీ

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్‌ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇంటి దొంగల్ని కనిపెట్టడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిషన్‌ కార్యదర్శి పీఏ ప్రవీణ్‌కుమార్‌ అరెస్టు కావడం, మాజీ ఉద్యోగి సురేష్‌ పేరు వెలుగులోకి రావడంతో లోతుగా ఆరా తీస్తోంది.

కమిషన్‌కు చెందిన వివిధ స్థాయిల ఉద్యోగులు 42 మందికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించడం ప్రారంభించింది. మరోపక్క తమ కస్టడీలో ఉన్న 9 మంది నిందితులను సిట్‌ అధికారులు బుధవారం ఏడు గంటల పాటు ప్రశ్నించారు. వీరి కస్టడీ గడువు గురువారంతో ముగియనుండటంతో విచారణ వేగవంతం చేశారు. బుధవారం కమిషన్‌ కార్యాలయానికి వెళ్లిన సైబర్‌ క్రైమ్‌ నిపుణుల బృందం కూడా నిందితులను ప్రశ్నించింది. 

ఇక టెక్నికల్‌ టీమ్‌ వంతు.. 
టీఎస్‌పీఎస్సీలో పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు భద్రపరిచే కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ మొదలుపెట్టి అన్ని విభాగాల్లోనూ కలిపి దాదాపు 150 కంప్యూటర్లు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా టెక్నికల్‌ టీమ్‌ పని చేస్తుంటుంది. నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా ఉండి, లీకేజ్‌ కేసులో అరెస్టు అయిన రాజశేఖర్‌ ఈ టీమ్‌లో కీలకంగా వ్యవహరించాడు.

ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సిట్‌ అధికారులు అంతర్గత లోపాలు గుర్తించడానికి టెక్నికల్‌ టీమ్‌ను ప్రశ్నించాలని నిర్ణయించారు. దీంతో పా టు వీరి బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలు రాశారా? వారికి ఎన్ని మార్కులు వచ్చాయి? గతంలో వారి ప్రతిభ ఎలా ఉంది? తదితర అంశాలను దర్యాప్తు చేస్తున్నారు.  

ముగ్గురి కోసం గాలింపు 
గ్రూప్‌ –1 ప్రిలిమ్స్‌ పేపర్‌ లీక్‌లో పాత్ర ఉన్నట్టుగా గుర్తించిన ముగ్గురు అందుబాటులో లేకపోవడంతో, వారిని నిందితులుగా అనుమానిస్తూ సిట్‌ గాలింపు చేపట్టింది. వీళ్లు కమిషన్‌ ఉద్యోగులే అని తెలుస్తోంది. 100 కంటే ఎక్కువ మార్కులు సాధించిన పదిమందిలో ఈ ముగ్గురు ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే నిందితులుగా ఉన్న 9 మందికి అదనంగా మరికొందరి పేర్లు జోడిస్తూ అధికారులు గురువారం కోర్టుకు సమాచారం ఇవ్వనున్నారు. 

శంకరలక్ష్మిది నిర్లక్ష్యమే..? 
లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షల పేపర్లను భద్రపరచడంలో శంకరలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్‌ భావిస్తోంది. ఈమెకు నోటీసులు జారీ చేసి ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సంబంధించి కమిషన్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ క్వశ్చన్‌ పేపర్‌ పరీక్షకు ముందే ప్రవీణ్, రాజశేఖర్, సురే ష్ లతో పాటు మరెవరికైనా చేరిందా అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది.

ఏఈ పరీక్ష పేపర్‌ క్రయవిక్రయాల్లో ప్రవీణ్, రేణుక, నీలేశ్, గోపాల్‌ మధ్య జరిగిన రూ.14 లక్షల లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు సైబర్‌ క్రైమ్‌ నిపుణుల బృందం కమిషన్‌ కార్యాలయంలో పని చేస్తున్న కీలక ఉద్యోగుల సెల్‌ఫోన్లు, వాట్సాప్‌ సంప్రదింపులను విశ్లేషించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.  

గ్రూప్‌–1లో 10 మంది ఉద్యోగులు పాస్‌ 
గతేడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసిన కమిషన్‌ ఉద్యోగుల్లో ముగ్గురు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో సహా పది మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కొందరికి ఊహించని విధంగా మార్కులు వచ్చాయని సిట్‌ గుర్తించింది.

ఇప్పటికే ఈ జాబితాను టీఎస్‌పీఎస్సీ నుంచి సేకరించిన అధికారులు వారికీ నోటీసులు జారీ చేసి విచారణకు సిద్ధమయ్యారు. కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్న కమిషన్‌ ఉద్యోగిని శంకరలక్ష్మి కంప్యూటర్‌ నుంచే ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయని ఇప్పటికే నిర్ధారణైంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు తనకు ఉన్న పరిజ్ఞానం వినియోగించిన రాజశేఖర్‌.. శంకరలక్ష్మి కంప్యూటర్‌లోకి అక్రమంగా చొరబడి ప్రశ్నపత్రాలు సంగ్రహించాడని తేల్చారు.

ఈ విధంగా లీకేజ్‌ వ్యవహారంలో సైబర్‌ నేరమూ ఉండటంతో ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ను జోడించాలని నిర్ణయించారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరిచే సమయంలో దీనికి సంబంధించి మెమో దాఖలు చేయనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top