Telangana: నిలబెట్టిన సం‘క్షేమం’!

Significantly reduced poverty in the state - Sakshi

రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన పేదరికం

సర్కారు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు ఊతం

ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో మారుతున్న సామాజిక ముఖ చిత్రం

నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ‘బహుముఖ పేదరిక సూచిక 2019–21’లో వెల్లడి

కుమురం భీం, గద్వాల జిల్లాల్లో మాత్రం ఇంకా వెనుకబాటు

ఆయా చోట్ల ప్రత్యేక ప్రణాళికలు, పథకాలు అవసరమంటున్న నిపుణులు

ఉచిత విద్యుత్, పంటల సాగుకు పెట్టుబడి సాయం, ఇంకా గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, రేషన్‌ పెంపు, ఆసరా పింఛన్లు, మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు వంటివి తెలంగాణ ఆర్థిక, సామాజిక చిత్రాన్ని మార్చుతున్నాయి. పౌష్టికాహారం, అక్షరాస్యత, లింగ సమానత్వం, ఉపాధి హామీ తదితర అంశాల్లో పురోగతితోపాటు పేదరికం తగ్గిపోతోంది.

ఈ మేరకు తాజాగా నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ‘బహుముఖ పేదరిక సూచిక 2019–21’లో తెలంగాణ జాతీయ సగటును మించి సత్ఫలితాలు సాధించినట్టు తెలిపింది. పేదలకు పౌష్టికాహారం మొదలుకుని బ్యాంకు ఖాతాల వరకు మొత్తం పన్నెండు అంశాలను పరిశీలించిన నీతి ఆయోగ్‌.. తెలంగాణలో నిరుపేదల సంఖ్య 5.88శాతానికి తగ్గినట్టు తేల్చింది.
-సాక్షి ప్రత్యేక ప్రతినిధి 

సంక్షేమ పథకాలే ఔషధంగా..
ఉచితాలు అనుచితం అభివృద్ధి నిరోధమంటూ సంక్షేమ పథకాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగు­తున్న నేపథ్యంలో.. సంక్షేమ పథకాలే ప్రజలు పేదరికం నుంచి బయటపడటానికి తోడ్పడుతున్నా­యని జాతీయ కుటుంబ సర్వే ఆధారంగా నీతి ఆయోగ్‌ వెలువరించిన పేదరిక సూచిక తేల్చింది. సంక్షేమ పథకాలు అమలవుతున్న రాష్ట్రాల్లో దారి­ద్య్ర రేఖను అధిగమిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 2015–2016లో 13.18శాతంగా ఉన్న ని­రుపేదల సంఖ్య.. మూడేళ్లలోనే 5.88 శాతానికి తగ్గిం­ది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 2015–16లో 11.77శాతంగా ఉన్న పేదరికం 6.06 శాతానికి తగ్గింది. పట్టణాల కంటే గ్రామాల్లో పేదల సంఖ్య వేగంగా తగ్గుతోందని నివేదిక తేల్చింది. తెలంగాణలో ప్రç­Ü్తుతం గ్రామాల్లో 7.51 శాతం, పట్టణా­లు–­నగరాల్లో 2.73శాతం పేదలు ఉన్నట్టు పేర్కొంది.

పోషకాహారమే సమస్య
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పోషకాహారమే పెద్ద సమస్యగా ఉందని నీతి ఆయోగ్‌ నివేదిక తెలిపింది. దీనివల్ల రక్తహీనత, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంటివి కొనసాగుతున్నాయని వెల్లడించింది. తెలంగాణలో 2015–16లో 9.78 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడగా.. 2019–21 నాటికి ఇది 4.91 శాతానికి తగ్గింది. ఇళ్లులేని వారిశాతం 2015–16లో 8.07 శాతంగా ఉండగా.. 2019–21 నాటికి 3.17 శాతానికి తగ్గింది.

కుమురంభీం, గద్వాలలో ఎక్కువ పేదరికం
రాష్ట్రంలో జాతీయ సగటును మించి కుమురం భీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పే­ద­రిక శాతం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాలు ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితిలో ఉన్నాయని.. అత్యంత వెనుకబడిన ఈ జిల్లాల్లో పేదరిక నిర్మూలన సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాల్సి ఉందని సామాజిక పరిశీలకులు అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాల ని.. పలు ప్రత్యేక పథకాల అమలు తక్షణ అవస­రమని సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్‌ వి.సత్తిరెడ్డి అభిప్రాయపడ్డారు.

సంక్షేమం.. ఉత్పాదక శక్తికి ఊతం
తెలంగాణలో సంక్షేమ పథకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మంచినీరు, విద్యుత్, పక్కా గృహాల విషయంలో చాలా మార్పు వచ్చింది. సంక్షేమ పథకాలు ఉ­త్పాదక శక్తికి ఊతం ఇస్తున్నాయి. నిరుపేదలు తమ కాళ్లపై తాము నిలబడే వరకు సంక్షేమ పథకాలు అమలు చేయటం, వాటిని అదే స్థాయిలో సద్విని­యోగం చేసుకుంటే సామాజిక మార్పు సాధ్యం. – డాక్టర్‌ రేవతి, సెస్‌ సంస్థ డైరెక్టర్‌

సామాజిక మార్పునకు కారణమవే..
అనేక వైరుధ్యాలున్న తెలంగాణ సమాజంలో ఇప్పుడు అమలవు తున్న సంక్షేమ పథకాలతో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సంపద వివిధ రూపంలో ప్రజలకు చేరుతోంది. దాంతో నిరుపేదలు సైతం సంపద సృష్టించే స్థాయికి చేరుతుండటం శుభ పరిణామం. – డాక్టర్‌ వర్రె వెంకటేశ్వర్లు, మాజీ ప్రధాన సమాచార కమిషనర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top