breaking news
poverty level
-
Telangana: నిలబెట్టిన సం‘క్షేమం’!
ఉచిత విద్యుత్, పంటల సాగుకు పెట్టుబడి సాయం, ఇంకా గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, రేషన్ పెంపు, ఆసరా పింఛన్లు, మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు వంటివి తెలంగాణ ఆర్థిక, సామాజిక చిత్రాన్ని మార్చుతున్నాయి. పౌష్టికాహారం, అక్షరాస్యత, లింగ సమానత్వం, ఉపాధి హామీ తదితర అంశాల్లో పురోగతితోపాటు పేదరికం తగ్గిపోతోంది. ఈ మేరకు తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘బహుముఖ పేదరిక సూచిక 2019–21’లో తెలంగాణ జాతీయ సగటును మించి సత్ఫలితాలు సాధించినట్టు తెలిపింది. పేదలకు పౌష్టికాహారం మొదలుకుని బ్యాంకు ఖాతాల వరకు మొత్తం పన్నెండు అంశాలను పరిశీలించిన నీతి ఆయోగ్.. తెలంగాణలో నిరుపేదల సంఖ్య 5.88శాతానికి తగ్గినట్టు తేల్చింది. -సాక్షి ప్రత్యేక ప్రతినిధి సంక్షేమ పథకాలే ఔషధంగా.. ఉచితాలు అనుచితం అభివృద్ధి నిరోధమంటూ సంక్షేమ పథకాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. సంక్షేమ పథకాలే ప్రజలు పేదరికం నుంచి బయటపడటానికి తోడ్పడుతున్నాయని జాతీయ కుటుంబ సర్వే ఆధారంగా నీతి ఆయోగ్ వెలువరించిన పేదరిక సూచిక తేల్చింది. సంక్షేమ పథకాలు అమలవుతున్న రాష్ట్రాల్లో దారిద్య్ర రేఖను అధిగమిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 2015–2016లో 13.18శాతంగా ఉన్న నిరుపేదల సంఖ్య.. మూడేళ్లలోనే 5.88 శాతానికి తగ్గింది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ 2015–16లో 11.77శాతంగా ఉన్న పేదరికం 6.06 శాతానికి తగ్గింది. పట్టణాల కంటే గ్రామాల్లో పేదల సంఖ్య వేగంగా తగ్గుతోందని నివేదిక తేల్చింది. తెలంగాణలో ప్రçÜ్తుతం గ్రామాల్లో 7.51 శాతం, పట్టణాలు–నగరాల్లో 2.73శాతం పేదలు ఉన్నట్టు పేర్కొంది. పోషకాహారమే సమస్య దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పోషకాహారమే పెద్ద సమస్యగా ఉందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. దీనివల్ల రక్తహీనత, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం వంటివి కొనసాగుతున్నాయని వెల్లడించింది. తెలంగాణలో 2015–16లో 9.78 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడగా.. 2019–21 నాటికి ఇది 4.91 శాతానికి తగ్గింది. ఇళ్లులేని వారిశాతం 2015–16లో 8.07 శాతంగా ఉండగా.. 2019–21 నాటికి 3.17 శాతానికి తగ్గింది. కుమురంభీం, గద్వాలలో ఎక్కువ పేదరికం రాష్ట్రంలో జాతీయ సగటును మించి కుమురం భీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పేదరిక శాతం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాలు ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితిలో ఉన్నాయని.. అత్యంత వెనుకబడిన ఈ జిల్లాల్లో పేదరిక నిర్మూలన సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాల్సి ఉందని సామాజిక పరిశీలకులు అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాల ని.. పలు ప్రత్యేక పథకాల అమలు తక్షణ అవసరమని సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ వి.సత్తిరెడ్డి అభిప్రాయపడ్డారు. సంక్షేమం.. ఉత్పాదక శక్తికి ఊతం తెలంగాణలో సంక్షేమ పథకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మంచినీరు, విద్యుత్, పక్కా గృహాల విషయంలో చాలా మార్పు వచ్చింది. సంక్షేమ పథకాలు ఉత్పాదక శక్తికి ఊతం ఇస్తున్నాయి. నిరుపేదలు తమ కాళ్లపై తాము నిలబడే వరకు సంక్షేమ పథకాలు అమలు చేయటం, వాటిని అదే స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే సామాజిక మార్పు సాధ్యం. – డాక్టర్ రేవతి, సెస్ సంస్థ డైరెక్టర్ సామాజిక మార్పునకు కారణమవే.. అనేక వైరుధ్యాలున్న తెలంగాణ సమాజంలో ఇప్పుడు అమలవు తున్న సంక్షేమ పథకాలతో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సంపద వివిధ రూపంలో ప్రజలకు చేరుతోంది. దాంతో నిరుపేదలు సైతం సంపద సృష్టించే స్థాయికి చేరుతుండటం శుభ పరిణామం. – డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, మాజీ ప్రధాన సమాచార కమిషనర్ -
2020లో పేదరికంలోకి 7 కోట్ల మంది.. భారత్లోనే 5.6 కోట్లు
వాషింగ్టన్: కోవిడ్-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఈ వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాలు తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభంలోకి జారుకున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ నివేదిక విస్తుపోయే వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కరోనా కారణంగా 2020లో ప్రపంచవ్యాప్తంగా 7.1 కోట్ల మంది నిరుపేదలుగా మారిపోయారు. అందులో 79 శాతం (5.6 కోట్లు) ఒక్క భారత్లోనే ఉండటం గమనార్హం. ‘పేదరికం, భాగస్వామ్య శ్రేయస్సు 2022’ అనే పేరుతో నివేదిక విడుదల చేసింది వరల్డ్ బ్యాంక్. కరోనా వైరస్ ప్రపంచ పేదరికంపై కోలుకోలేని దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. వైరల్ ప్రభావంతో ప్రపంచ పేదరికం రేటు 2019లో 8.4గా ఉండగా అది 2020లో 9.3కి చేరినట్లు నివేదించింది. నివేదిక ప్రకారం.. 2020 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 7.1 కోట్ల మంది కడు పేదరికంలోకి వెళ్లారు. దీంతో మొత్తం పేదరికుల సంఖ్య 70 కోట్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. ప్రపంచ పేదరికం పెరుగుదలకు ప్రధానంగా అత్యధిక జనాభా కలిగిన దేశాలే కారణమని తెలిపింది. 7 కోట్ల మందిలో భారత్ నుంచి 5.6 కోట్ల మంది ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, ఆర్థికంగానూ భారత్ తీవ్రంగా నష్టపోయినట్లు వెల్లడించింది. మరోవైపు.. ప్రపంచంలోనే జనాభాలో తొలిస్థానంలో ఉన్న చైనా మాత్రం నామమాత్రంగానే ఉన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
దారిద్య్ర నిర్మూలనలో సిక్కిం రికార్డు
గాంగ్టక్: దారిద్య్ర నిర్మూలనలో సిక్కిం ఘనమైన రికార్డు సాధించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న వారి సంఖ్య సిక్కింలో గణనీయంగా తగ్గింది. తలసరి వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రణాళికా సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. సిక్కింలో 2004-05 ఆర్థిక సంవత్సరంలో దారిద్య్రరేఖకు దిగువన 30.9 శాతం ఉండగా, 2011-12 నాటికి ఈ సంఖ్య 8.19 శాతానికి తగ్గింది. దారిద్య్రరేఖకు దిగువనున్న జనాభా శాతం తక్కువగా నమోదైన రాష్ట్రాల్లో గోవా (5.9 శాతం), కేరళ (7.05 శాతం), హిమాచల్ప్రదేశ్ (8.06 శాతం), సిక్కిం (8.19 శాతం), పంజాబ్ (8.26 శాతం), ఆంధ్రప్రదేశ్ (9.20 శాతం) ఉన్నాయి.