టికెట్ల ఆదాయం రూ. 5 వేల కోట్లపైనే 

SCR generates over Rs 5000 crore passenger revenue - Sakshi

2019లోని రూ. 4 వేల కోట్ల రికార్డు బ్రేక్‌ 

దక్షిణ మధ్య రైల్వేకు కాసులు కురిపిస్తున్న రైళ్లు 

దేశంలో 18 జోన్లకు గానూ ఐదో స్థానంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే 

సాక్షి, హైదరాబాద్‌: సరుకు రవాణా రూపంలో భారీగా ఆదాయాన్ని పొందుతూ దేశంలోని రైల్వే జోన్‌లలో కీలకంగా అవతరించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్యాసింజర్‌ రైళ్ల ద్వారా కూడా భారీ మొత్తంలో ఆదాయాన్ని నమోదు చేసింది.

టికెట్ల అమ్మకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో వారం రోజులు మిగిలి ఉండగానే రూ.5 వేల కోట్ల మార్కును అందుకుంది. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఇదే అతి పెద్ద ఆదాయంగా రికార్డుకెక్కింది. గురువారం నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5,000.81 కోట్లుగా నమోదైంది.

ఇప్పటివరకు ఆదాయం గరిష్ట మొత్తంగా రూ.2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.4,119.44 కోట్లు. ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్‌ చేస్తూ తొలిసారి రూ.5 వేల కోట్లను దాటింది. మార్చి చివరి నాటికి ఈ మొత్తం మరింత పెరగనుంది. ఈసారి దేశవ్యాప్తంగా చాలా జోన్లు టికెట్ల రూపంలో మంచి ఆదాయాలను సొంతం చేసుకున్నాయి. 18 జోన్లకు గానూ దక్షిణ మధ్య రైల్వే ఆదాయం విషయంలో ఐదో స్థానంలో నిలిచింది.  

కోవిడ్‌ తర్వాత ఇటీవలే పూర్తిస్థాయిలో.. 
కోవిడ్‌ లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు చాలా రైళ్లు పార్కింగ్‌ యార్డులకే పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే పూర్తిస్థాయి రైళ్లను నడుపుతున్నారు. కోవిడ్‌ తర్వాత తిరిగి 100 శాతం రైళ్లను నడిపిన తొలి జోన్‌గా దక్షిణ మధ్య రైల్వేనే నిలిచింది.

గతంలో ఎన్నడూ లేనట్టుగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో అదనపు రైళ్లు, ఉన్న రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే బిజీగా ఉంటోంది. ఇటీవల పలు రైళ్లకు అదనంగా ఏర్పాటు చేసిన వాటిల్లో 200 కోచ్‌లను శాశ్వత ప్రాతిపదికన నడుపుతున్నారు.

ఇక రద్దీ ఎక్కువగా ఉన్న సమయాలకు సంబంధించి రోజువారీ ప్రాతిపదికన 10,539 కోచ్‌లను తాత్కాలికంగా నిర్వహించారు. వీటి రూపంలో 9,83,559 మంది అదనంగా బెర్తులు పొందగలిగినట్టు అ«ధికారులు తెలిపారు. ఈ అదనపు ప్రయాణికుల ద్వారానే రూ. 81 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో 3,543 ప్రత్యేక రైళ్లను నడిపారు. వీటి ద్వారా 30.42 లక్షల మంది అదనంగా ప్రయాణించారు. వీరి ద్వారా రూ.219 కోట్లు అదనంగా సమకూరాయి. 

ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో 123 శాతం 
ఈ సంవత్సరం సికింద్రాబాద్‌–విశాఖ మధ్య దేశంలో ఎనిమిదో వందే భారత్‌ రైలును, కాచిగూడ–మెదక్, అకోలా–అకోట్, బీదర్‌–కలబురగి మధ్య కొత్త రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం 8 జతల రైళ్లకు కొత్తగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రారంభించారు. వీటిల్లో ప్రయాణికుల సామర్థ్యం ఎక్కువ కావటం వల్ల కూడా వారి సంఖ్య పెరిగింది.

వెరసి ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో 123 శాతానికి చేరుకోవటం విశేషం. చమురు ధరలు విపరీతంగా పెరగటంతో సొంత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. దూరప్రాంతాలకు రైళ్లలో వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ అన్ని కారణాలతో ఇప్పుడు రికార్డు స్థాయిలో ఆదాయం నమోదైందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top