ఒకే కుటుంబానికి చెందిన 18 మంది దుర్మరణం
మృతుల్లో తల్లిదండ్రులు, కుమారుడు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు
ముషీరాబాద్: సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం నగరవాసుల్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా వారి జీవిత ప్రయాణం ముగిసింది. విద్యానగర్ ఏడవ వీధి మార్క్స్ భవన్ పక్కన గల 1–9–295/11/ఏ/1 ఇంటి యజమాని ఎస్‌కే నసీరుద్దీన్ (70) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన రైల్వే ఉద్యోగి. భార్య అక్తర్ బేగం (60), ఆమెజాన్‌లో మేనేజర్‌గా పని చేసే రెండవ కుమారుడు సలావుద్దీన్ (40), భార్య ఫర్హానాతో పాటు వీరి ముగ్గురు పిల్లలు జైన్ (5), రిదా(6), షీజా(7) వెంట ఉన్నారు.
అమెరికాలో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న నసీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ భార్య సనా, ఆమె ముగ్గురు పిల్లలు హుజేర్, మెహరీష్, హుమేజాలు కూడా వీరికి తోడయ్యారు. అలాగే అప్పటికే వివాహమై నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆయన ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కూతురు అమీనాబేగం (మూసారాంబాగ్), ఆమె కుమార్తె అనీస్ (21), రెండవ కుమార్తె షబానా బేగం (హిమాయత్‌నగర్), ఆమె కుమారుడు జాఫర్, మూడవ కుమార్తె రిజ్వానా బేగం, ఆమె ఇద్దరు పిల్లలు మరియన్, షాజహాన్..మొత్తం 18 మంది అల్ మక్కా ట్రావెల్స్ ద్వారా సౌదీ వెళ్లారు. అమెరికాలో నివసించే పెద్ద కుమారుడు సిరాజుద్దీన్‌తో పాటు ముగ్గురు కూతుళ్ల భర్తలు మాత్రం ఇళ్ల వద్ద ఉండిపోయారు.
‘తల్లి’డిల్లిన వయో వృద్ధురాలు
నసీరుద్దీన్ కుటుంబ సభ్యులు 18 మంది అగ్నికి ఆహుతి కాగా, ఆయన తల్లి రోషన్‌బీ, పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ ఒక్కడు మాత్రమే మిగి లాడు. ఇతను గత కొంత కాలంగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. భార్య సనా, ముగ్గురు పిల్లలు మాత్రం విద్యానగర్‌లోని తల్లిదండ్రుల వద్ద నివసిస్తున్నారు. సిరాజుద్దీన్ తన సమీప బంధువులతో అమెరికా నుంచి మాట్లాడుతూ పెద్దపెట్టున రోదించాడు. నసీరుద్దీన తల్లి రోషన్‌బీ తల్లడిల్లిపోయింది. కాగా 18 మందిలో 10 మంది చిన్నారులే ఉండడం స్థానికుల హృదయాన్ని కలచి వేసింది. వీరంతా ఏడాది నుంచి 10 సంవత్సరాల లోపు వారే కావడం గమనార్హం.
నసీరుద్దీన తల్లి 90 ఏళ్లు పైబడిన రోషన్‌బీ తల్లడిల్లిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. తమ కుటుంబసభ్యులు తమ చివరి మజిలీని ముస్లింలకు పవిత్ర స్థలమైన మక్కాలోనే ముగించారు కాబట్టి వారి అంత్యక్రియలను కూడా అక్కడే నిర్వహిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, కాబట్టి 18 మంది అంత్యక్రియలు అక్కడే నిర్వహించాలని బంధువులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు వహీద్, మునీర్‌లతో పాటు మరో ఐదుగురు మక్కాకు వెళ్లేందుకు పాస్‌పోర్టులను హజ్ కమిటీకి అందజేశారు.
మౌన సాక్షిగా మిగిలిన ఇల్లు
నసీరుద్దీన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం 18 మంది మృతి చెందడంతో కనీసం ఆయన ఇంటి తలుపులు తెరిచే వారు కూడా లేకుండా పోయారు. సమీప బంధువులు వచ్చినా అక్కడ నిలబడి ఆ ఇంటి వైపు మౌనంగా చూస్తున్నారు తప్ప ఏమి చేయలేకపోతున్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శ
విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌లు నసీరుద్దీన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాగోల్‌లో అల్మారా దుకాణం నిర్వహించే అబ్దుల్ రషీద్ భార్య అమీనాబేగం, వారి కుమార్తె అనీస్ ఫాతిమా సౌదీలో మరణించడంతో మూసారాంబాగ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల తదితరులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


