కోటి దీపోత్సవంలో విఘ్నేశ్వరునికి పూజలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత
జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాస్తా
భక్తి టీవి కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
కవాడిగూడ (హైదరాబాద్): కార్తీక మాసంలో జరిగే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అలాగే కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమం 8వ రోజు చేరుకున్న సందర్భంగా కోటి దీపోత్సవ వేదికపై వేములవాడ రాజరాజేశ్వరి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీపై కోటి దీపోత్సవ ప్రాంగణంలో నలుమూలలా భక్తులకు దర్శన భాగ్యం కలి్పంచేందుకు ఊరేగించారు. రేవంత్‌రెడ్డి ఆయన సతీమణి గీత దంపతులను అల్దీపురం మఠం పీఠాధిపతి వామనాశ్రమ స్వామి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నేటి యాంత్రిక యుగంలో ఆధ్యాత్మికత మానసిక ధైర్యం, శక్తిని ఇస్తుందని ఇలాంటి కార్యక్రమాలను భక్తి టీవీ 14 ఏళ్లుగా దిగి్వజయంగా కొనసాగించడం అభినందనీయమని ప్రశంసించారు. తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కాకుండా నాలుగు కోట్ల ప్రజలకు వేదికగా నిలిచే కోటి దీపోత్సవ కార్యక్రమంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎన్టీవీ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి దంపతులు, స్వామీజీలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజ అనంతరం వేదికకు ఇరువైపులా ఉన్న అఖండ దీపాలను సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, నరేంద్ర చౌదరి దంపతులు వెలిగించిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో పాల్గొన్న భక్తులందరూ దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా శివనామ స్మరణతో ఎన్టీఆర్ స్టేడియం మారుమోగింది.


