తెలంగాణ: ‘కోటి కుటుంబాలు ఉంటే.. కోటి 53 లక్షల వాహనాలు’

Puvvada Ajay Kumar Says One Crore 53 Lakh Vehicles In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శనివారం.. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరిగింది. ఈ నెల 9న శాఖల వారీగా ప్రభుత్వ పద్దులపై చర్చ ప్రారంభం కాగా, మొత్తం 37 పద్దులను ఆమోదించారు. అసెంబ్లీలో శనివారం రాత్రి 11.48వరకు వార్షిక బడ్జెట్‌ పద్దులపై చర్చ జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసనసభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుండటంతో పద్దుల ఆమోదానికి చర్చ కొనసాగింది.

ఇక, శనివారం సభలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటే.. వాహనాలు మాత్రం ఒక కోటి 53 లక్షలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా ఈ బిడ్డింగ్ విధానంలో  ప్రభుత్వానికి రూ. 231 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఇదే సమయంలో ఆర్టీసీకి ప్రతి రోజు కోటి 77 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేశారు. 

మరోవైపు.. తెలంగాణలో ఈ ఏడాది 776 కొత్త బస్సులు ఆర్డర్ చేసినట్టు చెప్పుకొచ్చారు. త్వరలో 1,360 ఎలక్ట్రిక్ అద్దె  బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. తెలంగాణవ్యాప్తంగా 26 ఆర్టీసీ డిపోలు లాభల్లోకి వచ్చాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆదివారంలో శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top