‘గుజరాత్‌తో సమానంగా నిధులిస్తే మీకు సగమే వస్తాయి’ అంటూ మోదీ చమత్కరించగా.. చిరునవ్వులు చిందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
అభివృద్ధే లక్ష్యంగా కలిసి పనిచేద్దాం: ప్రధాని మోదీ
తెలంగాణ రైజింగ్‌ను వికసిత్ భారత్‌లో భాగం చేద్దాం
అభివృద్ధి విషయంలో రాజకీయాలకు చోటు లేదు
గుజరాత్‌కిచ్చిన ప్రాధాన్యతే తెలంగాణకూ.. అయితే, గుజరాత్‌కు పదేళ్లలో ఇచ్చినన్ని నిధులిస్తే మీకు సగమే వస్తాయని ఛలోక్తి
హెచ్‌ఐసీసీలో రూ.9,400 కోట్ల పనుల ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం ఎలాంటి వివక్ష చూపదని హామీ ఇచ్చారు. తెలంగాణ వికసిస్తేనే దేశం వికసిస్తుందనే నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోదీ.. హెచ్‌ఐసీసీ వేదికగా రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణను దేశ ఆర్థిక వృద్ధికి కీలక శక్తిగా అభివర్ణించిన ఆయన ఇవి కేవలం ప్రాజెక్టులు కాదు.. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు అని పేర్కొన్నారు. అంతకు ముందు నిధుల కేటాయింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఛలోక్తులు విసిరారు.
‘సీఎం రేవంత్ రెడ్డి గారూ.. ఇది వింటున్నారా?‘ అంటూ తెలంగాణకు కేంద్రం ఇస్తున్న భరోసాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను మోదీ గుర్తు చేశారు. ‘పదేళ్లుగా గుజరాత్‌కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. కేంద్రం పదేళ్లలో గుజరాత్‌కు ఎంత ఇచ్చిందో రేవంత్‌రెడ్డి చెప్పాలి. ఆ రాష్ట్రంతో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్‌తో సమానంగా నిధులిస్తే ఇప్పుడు వచ్చే దాంట్లో మీకు సగమే వస్తాయి. అన్ని రాష్ట్రాలను కేంద్రం ఐక్యంగా ముందుకు తీసుకెళ్తోంది.
తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉంది’అని మోదీ అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని ముఖ్యమంత్రికి సూచించారు. మౌలిక సదుపాయాలు, హైవేల అభివృద్ధి కోసం కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, దీనివల్ల తెలంగాణకు భారీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం నుంచి సహకారం లభించింది. ఇప్పుడు అదే భావనతో తెలంగాణకు కూడా సహకరిస్తున్నాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు స్థానం ఉండకూడదు’అని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్‌ను వికసిత్ భారత్‌లో భాగం చేద్దామంటూ పిలుపునిచ్చారు.
ఎన్నికలు ముగిశాయి.. ఇప్పుడు అభివృద్ధే ఎజెండా
‘ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పుడూ భేదభావం చూపలేదు. గత పదేళ్లలో తెలంగాణలో నిర్మించిన జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, మౌలిక సదుపాయాలే ఇందుకు నిదర్శనం’అని ప్రధాని పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలు ముగిశాయని.. ఇక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల అభ్యున్నతిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో భుజం భుజం కలిపి నడిస్తే తెలంగాణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు. సైబరాబాద్ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, ఇది దేశంలోనే అతిపెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని ప్రశంసించారు.
వరంగల్‌లో ఏర్పాటవుతున్న పీఎం మిత్ర పార్క్ (కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్) తెలంగాణ పారిశ్రామిక రంగానికి గేమ్ చేంజర్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ చేనేత కళాకారుల ప్రతిభ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ పార్క్ ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. స్థానికంగా తయారయ్యే వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్లకు చేరతాయి’అని చెప్పారు. దీంతో తెలంగాణ టెక్స్‌టైల్ రంగంలో ప్రధాన హబ్‌గా ఎదుగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ పాత్ర అత్యంత కీలకం
హైదరాబాద్–పనాజీ కారిడార్, జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి వంటి ప్రాజెక్టులను ప్రస్తావించిన ప్రధాని.. ‘ఇవి కేవలం రోడ్లు కాదు.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే ఇంజిన్లు’అని వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే పెట్టుబడులు పెరుగుతాయని.. తద్వారా యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో తెలంగాణ పాత్ర అత్యంత కీలకమని మోదీ అన్నారు.
మాటకు మాట...
సీఎం రేవంత్‌రెడ్డి: మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకారంతో గుజరాత్ మోడల్‌ను అభివృద్ధి చేశారు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నాటి మన్మోహన్ సింగ్ ఇచ్చిన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నా..’
ప్రధాని మోదీ: పదేళ్లుగా గుజరాత్‌కే ఎక్కువ నిధులు ఇచ్చారని అంటున్నారు. కేంద్రం పదేళ్లలో గుజరాత్‌కు ఎంత ఇచ్చిందో రేవంత్‌రెడ్డి చెప్పాలి. ఆ రాష్ట్రంతో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం. గుజరాత్‌తో సమానంగా నిధులిస్తే ఇప్పుడు వచ్చే దాంట్లో మీకు సగమే వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే బడ్జెట్ రూ. 1,000 కోట్లు కూడా దాటేది కాదు, కానీ ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.5,500 కోట్లు కేటాయించాం. మీరు కంటున్న కలలు చేరుకోవాలంటే మాతో కలసి రండి.. లేకపోతే ఎప్పటికీ అది సాధ్యం కాదు.


