
వానాకాలం సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వైరస్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై సమీక్షలో మంత్రి దామోదర
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ భరోసా ఇచ్చారు. కోవిడ్ కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ శాఖ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. అయితే ఇప్పుడు దేశంలో నమోదవుతున్న కేసులు సాధారణమైనవేనని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై మంత్రి దామోదర ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్, సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జలుబు, దగ్గు లాగే కోవిడ్ కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.. మాస్కు ధరించడం వంటి చర్యల ద్వారా వైరస్‌ల వ్యాప్తిని నిరోధించొచ్చని చెప్పారు.
ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అన్ని ఆస్పత్రుల్లో సరిపడా మందులు, రీఏజెంట్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కోవిడ్, డెంగీ పేరిట ప్రైవేటు ఆస్పత్రులు ప్రజల్ని దోచుకొనే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దామోదర స్పష్టం చేశారు.
జేఎన్–1 వేరియంట్‌తో ఆందోళన అక్కర్లేదు
దేశంలో కోవిడ్ జేఎన్–1 వేరియంట్ కేసులు కొన్ని నమోదయ్యాయని.. ఈ వేరియంట్ 2023 నుంచే దేశంలో వ్యాప్తిలో ఉందని అధికారులు మంత్రి దామోదరకు వివరించారు. ఈ వేరియంట్ వల్ల ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పరిస్థితులేమీ లేవన్నారు. ఇతర దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి తప్పితే ఇతరులెవరికీ ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం పడటం లేదన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడా నమోదయ్యే కోవిడ్ కేసులను ఎదుర్కొనేందుకు టెస్టింగ్ కిట్స్, మెడిసిన్ సహా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.