యాదాద్రి క్షేత్రం.. సొబగుల సోయగం

Pancha Narasimha Kshetra In Yadadri Is Shaping With Amazing Sculpture Skill - Sakshi

ఆలయ ప్రాకారాలు, విమానాలపై రాతి విగ్రహాలు

శంకు, చక్ర నామాలు.. గరుత్మంతుడు, సింహాలు, ఎనుగులు

దర్పనం పక్కన దీపకన్యల స్వాగత విగ్రహాలు

అద్భుత శిల్పకళా నైపుణ్యంతో యాదాద్రిలో పంచనారసింహ క్షేత్రం రూపుదిద్దుకుంటోంది. ఆధారశిల నుంచి రాజగోపురం వరకు నల్లరాతి కృష్ణ శిలలతో నిర్మాణం అవుతున్న ఏకైక ఆలయంగా చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పటికే ప్రధాన ఆలయ పనులన్నీ పూర్తి చేసుకున్న స్వయం భూక్షేత్రం.. త్వరలోనే భక్తులకు పునః దర్శనం కల్పించే దిశగా తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ ఆలయం భక్తులకు పురాణ ప్రాశస్త్య శోభను కలిగించనుంది. కృష్ణశిలలతో ఇప్పటికే ఆలయాన్ని అంతా నిర్మించారు. ఆలయానికి నలు వైపులా భక్తులను ఆకర్షించే విధంగా రాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు.   

                              

నలు దిక్కులా రాతి విగ్రహాలు
లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రధానాలయాన్ని పురాణ ప్రాశస్త్యమైన రాతి శిలా సౌరభాలను అద్దుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అడుగడుగునా ఆధ్యాత్మిక చింతన కలిగే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే ప్రధానాలయ మండపానికి నలుదిక్కులా విమానాలు, ప్రాకార మండపాలపై దేవదేవుడు నృసింహుడి ఇష్టవాహనమైన గరుత్మంతుడి విగ్రహాలను, ఆ విగ్రహాలకు ఇరువైపులా సింహం, శంకుచక్ర నామాలు ఏర్పాటు చేశారు. రెండున్నర అడుగుల ఎత్తుతో గరుత్మంతుడి విగ్రహాలు, ఒకటిన్నర అడుగు ఎత్తుతో సింహపు విగ్రహాలు, శంకు, చక్ర, తిరునామాలను అమర్చారు.  

లోపలి సాలహారాల్లో విగ్రహాల బిగింపు
ప్రధాన ఆలయ మొదటి ప్రాకారంలోని సాలహారాల్లో శ్రీత్రిదండి చినజీయర్‌ స్వామి సలహాలు, సూచనలతో దేవతా మూర్తుల విగ్రహాలను బిగించే ప్రక్రియను ఇటీవల పూర్తి చేశారు. ప్రధాన ఆలయం మొదటి ప్రాకారంలో సాలహారాల్లో 93 విగ్రహాలను బిగించారు. ఇందులో ప్రధానంగా దశవతారాలు, అష్టలక్ష్మి,  నృసింహస్వామి, ఆళ్వారులు, నారాయణమూర్తి వంటి విగ్రహాలను అమర్చారు.ఈ అంతర్, బాహ్య ప్రాకార మండపాల పైభాగంలోని సాలహారాల్లో విగ్రహాలను బిగించాల్సి ఉంది. సుమారు 150 విగ్రహాలు ప్రస్తుతం ఆళ్లగడ్డలో తయారు అవుతున్నాయి. వీటిని ఆలయ ప్రారంభం వరకు బిగించనున్నారు.

రాజగోపురాల ముందు..
ఆలయానికి నలు దిశలుగా పంచ, సప్త తల రాజగోపురాలను నిర్మించారు. ఈ రాజగోపురాలకు ముందు భాగంలో ప్రత్యేక ఆకర్షణీయంగా రాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. తూర్పు, పడమర రాజగోపురాల ముందు భారీ ఏనుగులు, ఉత్తర, దక్షిణ రాజగోపురాల ముందు భాగాల్లో రాతితో చెక్కిన భారీ సింహం విగ్రహాలను అమర్చారు. తూర్పు రాజగోపురం నుంచి భక్తులు ఆలయంలోకి ప్రవేశించి పడమటి రాజగోపురం నుంచి బయటికి వచ్చే సమయంలో ఈ భారీ ఎనుగు విగ్రహాలు కనువిందు చేయనున్నాయి. ఇక ఆలయానికి దక్షిణ, ఉత్తర రాజగోపురాల దిక్కుల్లో పర్యటించే సమయంలో సింహం విగ్రహాలు భక్తులను ఆధ్యాత్మిక పారావశ్యంలోకి ముంచెత్తనున్నాయి. ఆలయ సన్నిధిలోని బ్రహ్మోత్సవ మండపం, వేంచేపు మండపం, పుష్కరిణి మండపాలపై ఇప్పటికే గరుత్మంతుడి విగ్రహాలను బిగించారు. 

స్వాగత విగ్రహాల అమరిక
ప్రధాన ఆలయంలోని మహా మండపంలో ధ్వజస్తంభం వెనుక భాగంలో ఏర్పాటు చేసే దర్పనానికి ఇరువైపులా స్వాగత విగ్రహాలుగా ఆరు అడుగుల దీపకన్యలను అమర్చారు. ముఖిలత హస్తాలతో స్వామివారిని దర్శించిన భక్తులకు స్వాగతించే విధంగా ఏర్పాటు చేశారు. గర్భాలయానికి ఇరువైపులా తూర్పు, పడమర పంచతల రాజగోపురాల ముందు, బ్రహ్మోత్సవ మండపం ముందు భాగాల్లో సుమారు 6 అడుగుల ఎత్తులో ఉన్న స్వామివారి ద్వారాపాలకులైన భారీ చండ ప్రచండ విగ్రహాలను బిగించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top