బైక్‌పై నగ్నంగా వెళ్తున్న యువకుడు (ఫైల్)
నగరంలో గుర్తు తెలియని వ్యక్తుల హల్‌చల్
2021లో వాహనంపై నగ్నంగా యువకుడి చక్కర్లు
తాజాగా మలక్‌పేట్ అపార్ట్‌మెంట్‌లో ఒకరి సంచారం
నిందితులను పట్టుకోవడం పోలీసులకు సవాలే
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులకు దొంగలు, సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు తరచూ పని పెడుతుంటారు. ఈ పనుల్ని వాళ్లు తమ దైనందిన విధుల్లో భాగంగా భావిస్తుంటారు. అయితే.. ఒక్కోసారి అనివార్యమైన, అనవసర విధులు వచి్చపడుతుంటాయి. జాగిలాలు, పిల్లులు తప్పిపోయాయని కొందరు, వీటి కారణంగా ఘర్షణ పడి మరికొందరు ఠాణాలకు వస్తుంటారు. వీటన్నింటినీ మించిన తలనొప్పులు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. బహిరంగ ప్రదేశాల్లో దిగంబరంగా తిరిగే వ్యక్తులే దీనికి కారణం. మలక్‌పేట పరిధిలో గత వారం జరిగిన ఉదంతం కలకలం సృష్టించింది.
అప్పట్లో పట్టపగలు.. నడిరోడ్డుపై..
2021 మార్చిలో లంగర్‌హౌస్ ఠాణా పరిధిలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన నిందితుడు.. మూడు రోజుల తర్వాత పట్టపగలు దానిపై నగ్నంగా షికారు చేశాడు. బోయిన్‌పల్లి పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ ఏరియాతో మొదలెట్టి బొల్లారంలో ఉన్న మిలిటరీ ప్రాంతం, బేగంపేటలోని నాలాపై ఉన్న వంతెన, బల్కంపేట, సనత్‌నగర్ ఠాణాల పరిధిలో సంచరించాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన గస్తీ బృందాలు సనత్‌నగర్ ఎస్‌ఆర్టీ ప్రాంతంలోని నెహ్రూ పార్క్‌లో అతడిని గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించారు. వాహనాన్ని అక్కడే పడేసిన నిందితుడు రాళ్లతో దాడి చేస్తూ పారిపోయాడు.
ఇప్పుడు తెల్లవారుజామున.. అపార్ట్‌మెంట్‌లో..
గత మంగళవారం మలక్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచి్చంది. మూసారంబాగ్ వెస్ట్ ప్రశాంత్‌నగర్‌లోని గంగాధర అపార్ట్‌మెంట్‌లోకి ఓ మధ్యవయస్కుడు నగ్నంగా చొరబడ్డాడు. ఫ్లాట్ తలుపు సందుల్లో నుంచి తొంగి చూస్తూ అపార్ట్‌మెంట్ అంతా తిరుగుతూ పరుగులు పెట్టాడు. దీంతో అక్కడ నివసించే వాళ్లు భయాందోళనకు గురయ్యారు. అంతా బయటికి వచ్చి చూసేసరికి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ
తతంగం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. చివరకు అతగాడు కారులో వెళ్లిపోయినట్లు గుర్తించారు.
పోలీసుల అదుపులో నిందితుడు
మలక్‌పేట: మలక్‌పేట పీఎస్ పరిధి మూసారంబాగ్ డివిజన్ గంగాధర అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 14న అర్ధరాత్రి నగ్నంగా తిరిగిన వ్యక్తిని ఆదివారం మలక్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న అతని స్నేహితులు రాత్రి 10.30 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అదే విధంగా మలక్‌పేట బీజేపీ నాయకులు కూడా పీఎస్‌కు చేరుకుని నగ్నంగా తిరిగిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగ్నంగా సంచరించిన వ్యక్తిది అత్తాపూర్ అని తెలిసింది.
కారణం మానసిక సమస్యలే..
ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని రకాలైన మానసిక సమస్యలు ఉన్న వాళ్లు, మద్యం, డ్రగ్స్‌కు బానిసలైన వాళ్లు ఇలా ప్రవర్తిస్తారని అంటున్నారు. కొన్నిసార్లు స్నేహితులు లేదా పరిచయస్తులతో పందేలు కాసి అలా ప్రవర్తిస్తారని పేర్కొంటున్నారు.


