రెండు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

Published Fri, Nov 19 2021 2:14 AM

NIA Carries Out Raids On Maoists Homes In Hyderabad And Andhra Pradesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మాజీ మావోయిస్టులు, సానుభూతిపరుల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం సోదాలు చేసింది. వేర్వేరు బృందాలు, స్థానిక పోలీసులతో.. అన్నిచోట్లా ఉదయం ఆరు గంటల సమయంలో ఒకేసారి తనిఖీలు చేపట్టింది. 2019 జూలై 28న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్టు ప్రకటించింది.

హైదరాబాద్‌తోపాటు రాచకొండ, మెదక్, ప్రకాశం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు జిల్లాల్లో చేసిన ఈ సోదాల్లో.. కీలక డాక్యుమెంట్లు, సాహిత్యం, సెల్‌ఫోన్లు పెన్‌డ్రైవ్‌లను సీజ్‌ చేసినట్లు వెల్లడించింది. 2019 బస్తర్‌ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి.. సంజు అలియాస్‌ పాండు, పునెం అలియాస్‌ లక్ష్మణ్, మున్నీతోపాటు మరో 40 మందిపై ఈ ఏడాది మార్చిలో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో మావోయిస్టులకు కొందరు సహకరించినట్టుగా లభించిన ఆధారాల మేరకు తాజాగా సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. 

ఒక్క గది.. ఏడు గంటలు సోదాలు 
గురువారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు మహిళా హాస్టల్‌లోని ఓ గదిలో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. ఉదయం 6నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తనిఖీలు నిర్వహించింది. ఓయూ, సెంట్రల్‌ వర్సిటీ, ఇతర కాలేజీల్లో చదువుకునే ఆరుగురు విద్యారి్థనులు ఆ గదిలో ఉంటున్నారని తెలిసింది. వీరిలో ఓ విద్యారి్థని వివాహిత అని, ఆమె భర్త మావోయిస్టులతో కలిసి పనిచేశారని సమాచారం. తనిఖీల్లో కొన్నిపత్రాలు, పుస్తకాలను స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. 

అల్వాల్‌లో అమరవీరుల బంధు మిత్రుల కమిటీ సభ్యురాలు పద్మకుమారి, సుభానగర్‌లో సహాయ కార్యదర్శి భవాని నివాసాల్లో అధికారులు సోదాలు చేశారు. 
ఉమ్మడి మెదక్‌ జిల్లా చేగుంటలో మావోయిస్టు అగ్రనేత దుబాసి శంకర్‌ కుమారుడు నాగరాజు నివాసంలో సోదాలు చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. ఒక ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. 
హైదరాబాద్‌లోని నాగోల్‌లో మాజీ మావోయిస్టులు నార్ల రవిశర్మ, బెల్లపు అనురాధ దంపతుల నివాసంలో సోదా చేసి.. కంప్యూ టర్‌ హార్డ్‌డిస్క్‌లు, విప్లవ సాహిత్యాన్ని స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. 
వనస్థలిపురం ఇంజనీర్స్‌కాలనీలో రిటైర్డ్‌ లెక్చరర్, టీపీఎఫ్‌ చైర్మన్‌ కె.రవిచంద్ర నివాసంలోనూ ఎన్‌ఐఏ తనిఖీ చేసింది. 
మరోవైపు ఏపీలోని వైజాగ్‌లో న్యాయవాద దంపతులు అందలూరి అన్నపూర్ణ, శ్రీనివాస్‌రావు.. ప్రకాశం జిల్లా అలకురపాడులో విప్లవ సాహిత్య రచయిత జి.కల్యాణ్‌రావు నివాసాల్లోనూ ఎన్‌ఐఏ తనిఖీలు చేసింది. 

ఎన్‌ఐఏ దాడులు సరికాదు 
సమాజంలో వివిధ వర్గాల సమస్యల పరిష్కారం, న్యాయమైన హక్కుల సాధన కోసం పోరాడుతున్న ప్రజాసంఘాల కార్యకర్తలపై ఎన్‌ఐఏ దాడులను ఖండిస్తున్నట్టు అమరుల బంధుమిత్రుల సంఘం ప్రకటించింది. వందల మంది పోలీసుల పహారాతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొంది.  హక్కుల కార్యకర్తలు, రచయితలపై ఎన్‌ఐఏ దాడులను ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు.


నార్ల రవిశర్మ, బెల్లపు అనురాధ దంపతులు 

Advertisement
Advertisement