బేఫికర్‌.. హోం లాకర్ | New trend in rental policy with Corona effect | Sakshi
Sakshi News home page

బేఫికర్‌.. హోం లాకర్

Jul 26 2020 5:05 AM | Updated on Jul 26 2020 5:12 AM

New trend in rental policy with Corona effect - Sakshi

రమేశ్‌ దిల్‌సుఖ్‌నగర్‌ దగ్గర టిఫిన్‌ సెంటర్‌ నిర్వహించేవాడు. కరోనా వైరస్‌ వ్యాప్తితో లాక్‌డౌన్‌ కాలమంతా సెంటర్‌ మూతపడింది. తర్వాత సడలింపులిచ్చినా.. వ్యాపారం పుంజుకోలేదు. దీంతో కొన్ని నెలలు హోటల్‌ మూసేసి, సొంతూరు శ్రీకాకుళం వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ సమయంలో దుకాణం, ఇంటి అద్దె భారం కాకుండా సమీపంలో హోంలాకర్‌ నిర్వహిస్తున్న ఓ ఇంట్లో సింగిల్‌ రూమ్‌ను అద్దెకు తీసుకుని రూ.3.7లక్షల విలువైన సామాన్లన్నీ అందులోకి సర్దేశాడు. ఇదివరకు ఇళ్లు, దుకాణం అద్దె రూ.12 వేలు అయ్యేది. ప్రస్తుతం హోం లాకర్‌కు నెలకు రూ.వెయ్యి మాత్రమే. పరిస్థితి చక్కబడ్డాక తిరిగి వచ్చి వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌: కరోనా, లాక్‌డౌన్, ఆ తర్వాతి పరిస్థితులు పలు రంగాలపై తీవ్ర ప్రభావాన్నే చూపాయి. ఈ క్రమంలో ఇంటిని అద్దెకు ఇచ్చే పద్ధతులూ మారిపోయా యి. లావాదేవీలు తగ్గిపోయి, వ్యాపారాలు ముందుకు సాగని పరిస్థితుల్లో పలువురు చిల్లర వర్తకులు సొంతూరి బాట పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లాం టి నగరాల్లో చిన్నపాటి వ్యాపారాలు, వివిధ కంపెనీల్లో రోజువారీ పద్ధతిలో పనిచేసేవాళ్లంతా సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో పలు ఇళ్లకు అద్దె బోర్డులు వేలాడుతున్నాయి. ఈ పరిస్థితిలో కొందరు ఔత్సాహికులు ఇంటిని అద్దెకిచ్చే పద్ధతినే మార్చేశారు. సింగిల్, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను హోంలాకర్స్‌గా మార్చేస్తున్నారు. ఇదే పద్ధతిలో ఇప్పట్లో తెరుచుకోని ఫంక్షన్‌హాళ్లు, బ్యాంకెట్లు, గోదాములనూ ఇంటి సామగ్రిని భద్రపరిచేందుగా వీలుగా మారుస్తున్నారు.

తక్కువ కిరాయితో భద్రం: కరోనా వైరస్‌ ప్రభావం మరో ఆర్నెల్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వేల రూపాయలు అద్దె చెల్లించి ఇక్కడుండటం కంటే సొంతూర్లో ఏదో పని చేసుకుని బతుకొచ్చనే భావనతో చాలామంది తిరుగుబాట పడుతున్నారు. ఈ క్రమంలో ఇళ్లను, దుకాణాలను ఖాళీ చేసి సరుకులన్నీ వెనక్కి తీసుకుపోవడం, తిరిగి వాటిని నగరానికి తీ సుకురావడం  ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ఇక్కడే చిన్న గదిలో సామాను భద్రపర్చే సదుపాయాన్ని వెతుకుతున్న వారికి హోంలాకర్స్‌ అండగా ఉంటున్నాయి. ఇక్కడ వస్తువులు, సామాన్లను భద్రపర్చుకుని గదికి తాళం వేసుకునే వెసులుబాటు ఉంది.

ఈ క్రమంలో చాలామంది హోంలాకర్స్‌ వైపు దృష్టి సారిస్తున్నారు. పలువురు ఇళ్ల యజమానులు సెల్లార్‌ స్థలాన్ని హోంలాకర్స్‌ కింద ఏర్పాటు చేస్తున్నారు. ఎల్‌బీనగర్‌లోని ఓ ఇంటి సెల్లార్‌లో 16 హోంలాకర్స్‌ ఏర్పాటు చేశారు. తాత్కాలిక పద్ధతిలో ఏర్పాటుచేసిన ఈ లాకర్స్‌తో ఆ యజమానికి నెలకు సగటున 20వేల అద్దె వస్తుంది. పార్కింగ్‌ కోసం వాడే స్థలంలోనే వీటిని ఏర్పాటుచేసి హోంలాకర్స్‌ పేరిట ఈ మొత్తాన్ని సంపాదిస్తుండడం గమనార్హం. కరోనా తీవ్రత తగ్గాక తిరిగి పార్కింగ్‌ లేదా ఇతర అవసరాలకు ఆ స్థలాన్ని వినియోగిస్తామని నిర్వహకుడు ఏ.జనార్దన్‌రావు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement