మృగరాజుపై కరోనా పంజా

Nehru Zoo Park Staff Identified Eight Lions Have Coronavirus Symptoms - Sakshi

జూపార్కులో 8 సింహాలకు కోవిడ్‌

గత నెల 24న నమూనాల సేకరణ

మంగళవారం నిర్ధారించిన లాకోన్స్‌

ప్రమాదమేమీ లేదని సీసీఎంబీ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌/ బహదూర్‌పురా: హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లోని 8 సింహాలు కరోనా బారిన పడ్డాయి. భారత్‌లో లక్షల మంది ప్రాణాలు హరించిన కోవిడ్‌ మహమ్మారి జంతువులకూ సోకడం ఇదే తొలిసారి. గత నెల 24వ తేదీకి ముందు సింహాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటం గమనించిన జూ సిబ్బంది సమాచారాన్ని అధికారులకు తెలిపారు. అప్పటికే జూలోని యానిమల్‌ కీపర్లకు కరోనా పరీక్షలను నిర్వహించగా.. దాదాపు 25 నుంచి 30 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన జూ అధికారులు సింహాల నోరు, ముక్కు నుంచి ద్రవాలు సేకరించారు. ఆ నమూనాలను సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ అనుబంధ సంస్థ ల్యాబొరేటరీ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఎండేంజర్డ్‌ స్పీషీస్‌ (లాకోన్స్‌)లో ఈ నమూనాలను విశ్లేషించగా, కోవిడ్‌–19 ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

సెంటర్‌ జూ అథారిటీ మార్గదర్శకాలను అనుసరించి ఈ ఏషియాటిక్‌ సింహాల ముక్కు, నోటిలోని ద్రవాల నమూనాలను సేకరించామని, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ద్వారా కరోన బారిన పడినట్లు నిర్ధారించామని సీసీఎంబీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఏషియాటిక్‌ సింహాల్లో కనిపించిన కరోనా వైరస్‌ అంత ప్రమాదకరమైన రకమేమీ కాదని సీసీఎంబీ స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా బారిన పడ్డ సింహాలన్నింటినీ వేరుగా ఉంచామని, తగిన చికిత్స అందిస్తున్నామని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ క్యూరేటర్‌ సుభద్ర దేవి తెలిపారు. తెలంగాణ జంతు సంరక్షణాలయాల డైరెక్టర్‌ డాక్టర్‌ కుక్రెటి మాట్లాడుతూ.. కరోన బారిన పడ్డ సింహాలు చికిత్సకు స్పందిస్తున్నాయని, కోలుకుంటున్నాయని వివరించారు.

5 మగ, 3 ఆడ సింహాలకు..
జూలాజికల్‌ పార్కులో ఉన్న లయన్‌ సఫారీలోని ఐదు మగ సింహాలు, మూడు ఆడ సింహాలు కరోనా బారిన పడ్డాయి. గతంలో పులుల ఎన్‌క్లోజర్‌లో పని చేసిన ఓ యానిమల్‌ కీపర్‌ను సింహాల ఎన్‌క్లోజర్‌కు మార్చారు. గత నెల ఏప్రిల్‌లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఆ యానిమల్‌ కీపర్‌కు పాజిటివ్‌ వచ్చింది. అతడిని క్వారంటైన్‌ కు పంపిన కొద్ది రోజులకే సింహాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటాన్ని గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తి.. సింహాలకు అందించిన ఆహారంతోనే కరోనా సోకిందా.. లేదా ఇతర కారణాలతో వచ్చిందా అనే విషయం తేలాల్సి ఉంది. 

ఇప్పటికే చాలా జంతువులకు కరోనా?
గతేడాది కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి పలు జంతు సంరక్షణ కేంద్రాల్లో జంతువులు వ్యాధి బారిన పడినట్లు సమాచారం ఉందని, మనుషుల నుంచి సోకిన ఈ వ్యాధి ఇతర జంతువులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లాకోన్స్‌ సైంటిస్ట్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ కార్తికేయన్‌ వాసుదేవన్‌ తెలిపారు. ఈ ఆసియా సింహాల్లో వ్యాధి లక్షణాలను గుర్తించడంతో పాటు, నమూనాల సేకరణకు మెరుగైన మార్గాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉందని వివరించారు.

జంతువులకు నాలుగు కేంద్రాలు..
జంతువుల్లో కరోనా నిర్ధారణకు భారత్‌ లో మొత్తం నాలుగు కేంద్రాలు ఉండగా.. హైదరాబాద్‌లోని లాకోన్స్‌ అందులో ఒకటి. ప్రతి జంతువు లాలాజలం సేకరించడం కష్టమైన పని కాబట్టి, జంతువుల మలం ద్వారా వ్యాధిని నిర్ధారించేందుకు తాము ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నామని, తద్వారా బోనుల్లో ఉండే, స్వేచ్ఛగా తిరిగే జంతువుల నమూనాలు సేకరించడం సులువవుతుందని సీసీఎంబీ గౌరవ సలహాదారు, మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. జంతువుల్లో కరోనా వైరస్‌ను సీసీఎంబీ ఇప్పటివరకు గుర్తించలేదని, అయితే త్వరలో ఈ దిశగా ప్రయత్నాలు చేస్తామని సీసీఎంబీ తాత్కాలిక డైరెక్టర్‌ డాక్టర్‌ వి.ఎం.తివారీ తెలిపారు.

వాటి నుంచి మనకు సోకదు!
ఏషియాటిక్‌ సింహాలకు సోకిన కరోనా వైరస్‌ మళ్లీ మనుషులకు సోకే అవకాశం లేదని, మనకు సోకుతుందనేందుకు తగిన ఆధారాలు లేవని సెంట్రల్‌ జూ అథారిటీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల జంతువులకు ఈ వ్యాధి సోకినప్పటికీ వాటి నుంచి తిరిగి మనుషులకు సోకినట్లు సమాచారం లేదని తెలిపింది. దేశంలోని అన్ని జంతు సంరక్షణ కేంద్రాల్లో కోవిడ్‌–19 నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, తగిన మార్గదర్శకాలు కూడా జారీ చేశామని తెలిపింది. పలు నివేదికల ప్రకారం.. గతేడాది స్పెయిన్‌ లోని బార్సిలోనాలోని ఓ జూలో సింహాలు, పులులకు కరోనా నిర్ధారణ అయింది. కాగా, రాష్ట్రంలో ఉన్న జూ పార్కులు, టైగర్‌ రిజర్వులు, వైల్డ్‌ లైఫ్‌ శాంచురీలు మే 2 నుంచి మూత పడిన సంగతి తెలిసిన విషయమే. 

చదవండి: కరోనా: ఆహారం అందిస్తాం.. అంత్యక్రియలు చేస్తాం..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top