
బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ అభ్యర్థి అవుతాడనుకున్న అజారుద్దీన్‌కు ఢిల్లీ సిఫారసుతో ఎమ్మెల్సీ హోదా
కేబినెట్‌లో సైతం అవకాశం? అమేర్ అలీఖాన్‌కు ప్రభుత్వ పదవి
జూబ్లీహిల్స్ టికెట్ రేసులో బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్‌ను రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేయడంతో, పార్టీ పరంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనూహ్య మలుపు తీసుకుంది. ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ పేరు దాదాపు ఖరారైందనే వార్తల నేపథ్యంలో..అనూహ్యంగా ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ నిర్ణయం వెనుక ఢిల్లీ పెద్దల సిఫారసు ఉందని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆలోచించి నియోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా నిర్ణయం తీసుకుందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. అజారుద్దీన్ రేసు నుంచి వైదొలగడంతో ఆ స్థానంలో పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. సర్వేలతో పాటు సామాజిక సమీకరణలు, ఎన్నికల నాటికి స్థానిక పరిస్థితుల ఆధారంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఖరారు చేస్తారని సమాచారం.
అన్ని అంశాలూ పరిగణనలోకి...!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు వి.నవీన్యాదవ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ బలమైన బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో పాటు ఇతర సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ ఇద్దరి పేర్లను పీసీసీ తీవ్రంగా పరిశీలిస్తోంది. రేసులో స్థానిక కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి కూడా ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి టికెట్ ఇవ్వాలనుకుంటే పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం.
అయితే చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పెద్దలు యోచించినా ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మున్నూరు కాపు, యాదవ (భార్య కులం) సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు హైదరాబాద్ మేయర్‌గా పనిచేసిన అనుభవం, సౌమ్యుడనే పేరు, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలతో కూడా గతంలో సంబంధాలు కలిగిన బొంతు రామ్మోహన్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు స్థానికుడైన యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ కూడా టికెట్ కోసం గట్టిగా పట్టు పడుతున్నట్లు సమాచారం. వీరే కాక చివరి నిమిషంలో అన్ని హంగులున్న మరో ప్రముఖ వ్యక్తి కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందని, అయితే ఆ వ్యక్తి పేరును ఇప్పుడే బహిర్గతం చేయలేమని గాంధీభవన్ వర్గాలంటున్నాయి.
ఆయనకు మంత్రి.. ఈయనకు మంచి పదవి
ఎమ్మెల్సీగా నామినేట్ అయిన అజారుద్దీన్‌కు భవిష్యత్తులో కేబినెట్‌లో కూడా స్థానం లభించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లాతో పాటు మైనార్టీ కోటాలో అజారుద్దీన్ మంత్రి అవుతారని, ఈయనకు హైకమాండ్ ఆశీస్సులు కూడా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్సీగా మొన్నటివరకు పనిచేసిన మరో మైనార్టీ నేత అమేర్ అలీఖాన్‌కు కూడా ప్రభుత్వ పదవి ఇస్తారని అంటున్నారు. ఆయనను కీలక కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.