హైదరాబాద్‌ రోడ్డులో గజం 10 వేలు.. సాగర్‌ రోడ్డులో 2 వేలు! | Nalgonda: Non Agricultural Land Rates To Be Hiked Details | Sakshi
Sakshi News home page

నల్గొండ: హైదరాబాద్‌ రోడ్డులో ప్రస్తుతం గజం 10 వేలు!

Jul 10 2021 8:30 AM | Updated on Jul 10 2021 3:54 PM

Nalgonda: Non Agricultural Land Rates To Be Hiked Details - Sakshi

నల్లగొండ జిల్లాలో గతంలో భూముల విలువ ఇలా.. హైదరాబాద్‌ రోడ్డులో గజం ధర 10వేలు

నల్లగొండ : భూముల విలువ పెంపునకు రంగం సిద్ధమైంది. ఏఏ ప్రాంతంలో ఎంత మొత్తం పెంచాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న విలువలో దాదాపు 40 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అందులో భాగంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం భూముల విలువ ఎంత ఉందనే దానిపై అధికారులు కార్యాలయాల వారీగా నివేదికలు పంపారు. రాష్ట్రంలో భూముల విలువ ఉమ్మడి రాష్ట్రంలో 2013లో పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పెంచలేదు. ప్రస్తుతం భూముల ధరలు బహిరంగ మార్కెట్‌లో భారీగా పెరగడంతో ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్‌ విలువ పెంచేందుకు సిద్ధమైంది. 

రోజుకు వెయ్యి రిజిస్ట్రేషన్లు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో రోజూ దాదాపు వెయ్యి వరకు వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. భూములకు సంబంధించి 8 ఏళ్ల క్రితం నాటి ధరలే అమలవుతున్నాయి. దీంతో భూముల విలువను రెట్టింపు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రస్తుతం నెలకు రూ.20 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రభుత్వం రేట్లు 50 శాతం పెంచితే ఆదాయం రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. 

గతంలో ధరల పెంపు ఇలా..
గతంలో భూముల విలువ పెంపుకోసం జిల్లాస్థాయిలో కమిటీలు ఉండేవి తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్, ఆర్డీఓతోపాటు కలెక్టర్‌ కూడా ఫైనల్‌గా ధరల పెంపు విషయంలో చర్చించి ఏమేరకు పెంచవచ్చన్నది జిల్లాస్థాయిలోనే నిర్ణయించి రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికలు పంపేవారు. ఇందులో ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు ఎలా ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఎంత వసూలు చేస్తున్నాం. అక్కడ పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ మేరకు చార్జీలు పెంచితే బాగుంటుందన్నది జిల్లాస్థాయిలో బిల్డర్లు, రియల్టర్లతో కూడా అధికారులు చర్చించి ధరలపై నిర్ణయం తీసుకునేవారు. 

ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ చార్జీలు..
ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ శాఖ ఒక్కో రిజిస్ట్రేషన్‌ భూమి విలువపై 6శాతం చార్జ్‌ వసూలు చేస్తుంది. అందులో 4 శాతం స్టాంప్‌డ్యూటీ కాగా, 1.5 ట్రాన్స్‌ఫర్‌ చార్జీ, 0.5 రిజిస్ట్రేషన్‌ రుసుం కింద మొత్తం 6శాతం వసూలు చేస్తోంది.

ఈసారి ప్రభుత్వ నిర్ణయమే..
జిల్లాస్థాయిలో ఏఏ ప్రాంతాల్లో ఏమేరకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ తదితర చార్జీలు వసూలు చేస్తున్నారన్న దానిపై ప్రభుత్వం ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా నివేదికలు తీసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో ప్రస్తుతం గజం రూ.10 వేలు భూమికి విలువ ఉంది. రోడ్డుకు కాస్త లోపల రూ.6 వేలు, దేవరకొండ రోడ్డులో రోడ్డు సైడ్‌ రూ.3 వేలు ఉండగా రెండో బిట్‌ రూ.2,500, మిర్యాలగూడ రహదారిలో రోడ్డు సైడ్‌ బిట్‌ రూ.10 వేలు ఉండగా, రెండో బిట్‌ రూ.6 వేలు ఉంది. సాగర్‌ రోడ్డులో రూ.2 వేలు ఉండగా రెండో బిట్‌ గజం రూ.1,200 ఉంది. ఈ విలువపై 6 శాతం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ తదితర చార్జీలను ప్రభుత్వం వసూలు చేస్తుంది. ప్రస్తుతం వీటి ధరలు 40నుంచి 50శాతం వరకు పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం కూడా అదేస్థాయిలో పెరగనుంది. 

ఎంత పెంచుతుందన్నది తెలియదు
ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో భూముల ధరలు ఏవిధంగా ఉన్నాయన్నది ప్రభుత్వం అడిగింది. వాటి వివరాలను కార్యాలయాల వారీగా పంపించాం. ధరల పెంపు అన్నది ఈసా రి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎంత ధర పెరుగుతుందన్నది కూడా మాకు తెలియదు. 
– ప్రవీణ్‌కుమార్, డీఆర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement