breaking news
Hyderabad - Nalgonda
-
హైదరాబాద్ రోడ్డులో గజం 10 వేలు.. సాగర్ రోడ్డులో 2 వేలు!
నల్లగొండ : భూముల విలువ పెంపునకు రంగం సిద్ధమైంది. ఏఏ ప్రాంతంలో ఎంత మొత్తం పెంచాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న విలువలో దాదాపు 40 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అందులో భాగంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం భూముల విలువ ఎంత ఉందనే దానిపై అధికారులు కార్యాలయాల వారీగా నివేదికలు పంపారు. రాష్ట్రంలో భూముల విలువ ఉమ్మడి రాష్ట్రంలో 2013లో పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పెంచలేదు. ప్రస్తుతం భూముల ధరలు బహిరంగ మార్కెట్లో భారీగా పెరగడంతో ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు సిద్ధమైంది. రోజుకు వెయ్యి రిజిస్ట్రేషన్లు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో రోజూ దాదాపు వెయ్యి వరకు వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. భూములకు సంబంధించి 8 ఏళ్ల క్రితం నాటి ధరలే అమలవుతున్నాయి. దీంతో భూముల విలువను రెట్టింపు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రస్తుతం నెలకు రూ.20 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రభుత్వం రేట్లు 50 శాతం పెంచితే ఆదాయం రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. గతంలో ధరల పెంపు ఇలా.. గతంలో భూముల విలువ పెంపుకోసం జిల్లాస్థాయిలో కమిటీలు ఉండేవి తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్, ఆర్డీఓతోపాటు కలెక్టర్ కూడా ఫైనల్‌గా ధరల పెంపు విషయంలో చర్చించి ఏమేరకు పెంచవచ్చన్నది జిల్లాస్థాయిలోనే నిర్ణయించి రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికలు పంపేవారు. ఇందులో ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో భూముల ధరలు ఎలా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చార్జీలు ఎంత వసూలు చేస్తున్నాం. అక్కడ పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ మేరకు చార్జీలు పెంచితే బాగుంటుందన్నది జిల్లాస్థాయిలో బిల్డర్లు, రియల్టర్లతో కూడా అధికారులు చర్చించి ధరలపై నిర్ణయం తీసుకునేవారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చార్జీలు.. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖ ఒక్కో రిజిస్ట్రేషన్ భూమి విలువపై 6శాతం చార్జ్ వసూలు చేస్తుంది. అందులో 4 శాతం స్టాంప్‌డ్యూటీ కాగా, 1.5 ట్రాన్స్ఫర్ చార్జీ, 0.5 రిజిస్ట్రేషన్ రుసుం కింద మొత్తం 6శాతం వసూలు చేస్తోంది. ఈసారి ప్రభుత్వ నిర్ణయమే.. జిల్లాస్థాయిలో ఏఏ ప్రాంతాల్లో ఏమేరకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర చార్జీలు వసూలు చేస్తున్నారన్న దానిపై ప్రభుత్వం ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా నివేదికలు తీసుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రస్తుతం గజం రూ.10 వేలు భూమికి విలువ ఉంది. రోడ్డుకు కాస్త లోపల రూ.6 వేలు, దేవరకొండ రోడ్డులో రోడ్డు సైడ్ రూ.3 వేలు ఉండగా రెండో బిట్ రూ.2,500, మిర్యాలగూడ రహదారిలో రోడ్డు సైడ్ బిట్ రూ.10 వేలు ఉండగా, రెండో బిట్ రూ.6 వేలు ఉంది. సాగర్ రోడ్డులో రూ.2 వేలు ఉండగా రెండో బిట్ గజం రూ.1,200 ఉంది. ఈ విలువపై 6 శాతం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర చార్జీలను ప్రభుత్వం వసూలు చేస్తుంది. ప్రస్తుతం వీటి ధరలు 40నుంచి 50శాతం వరకు పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం కూడా అదేస్థాయిలో పెరగనుంది. ఎంత పెంచుతుందన్నది తెలియదు ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల ధరలు ఏవిధంగా ఉన్నాయన్నది ప్రభుత్వం అడిగింది. వాటి వివరాలను కార్యాలయాల వారీగా పంపించాం. ధరల పెంపు అన్నది ఈసా రి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎంత ధర పెరుగుతుందన్నది కూడా మాకు తెలియదు. – ప్రవీణ్‌కుమార్, డీఆర్ -
ఉపాధికి ‘కారిడార్’
* హైదరాబాద్- నల్లగొండ మధ్య పరిశ్రమల ఏర్పాటుకు సీఎం హామీ * రెండో దశలో చేపడతామని అసెంబ్లీలో ప్రకటన * ఫార్మా అనుబంధ పరిశ్రమలకు ఎక్కువ అవకాశం * ఇప్పటికే 11వేల ఎకరాలను సర్వే చేసిన * జిల్లా యంత్రాంగం * అన్నీ అనుకూలిస్తే మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర రాజధానికి సమీపంలోని జిల్లాకు మరో కారిడార్ మంజూరైంది. హైదరాబాద్-నల్లగొండ మధ్య ఇండ స్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. ప్రభుత్వ పరిశ్రమల విధానంలో భాగంగా తెలంగాణలో కారిడార్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, అందులో హైదరాబాద్-నల్లగొండ కారిడార్‌ను రెండో దశలో చేపడతామని ఆయన వెల్లడించారు. సీఎం ప్రకటనతో జిల్లాకు చెందిన ఔత్సాహిక పారి శ్రామికవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, అన్నీ అనుకూలిస్తే ఈ కారిడార్ మూడేళ్లలో పూర్తి కావచ్చని పరిశ్రమల అధికారులంటున్నారు. ఇప్పటికే భూమి చూసేశారు.. వాస్తవానికి మన జిల్లాలో ఫార్మా, సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. సిమెంటు పరిశ్రమలు కృష్ణానది తీరంలో, రాష్ట్ర సరిహద్దులో ఎక్కువగా ఉండగా, హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై చౌటుప్పల్ సమీపంలో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. పరిశ్రమల కారిడార్ సీఎం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు ఫార్మా అనుబంధ పరిశ్రమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఫార్మా పరిశ్రమ ఇప్పటికే ఉన్నందున దాని అనుబంధ ఉత్పత్తులకు చెందిన పరిశ్రమలతోపాటు హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఔషధ, జూట్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని జిల్లాకు చెందిన పరిశ్రమల శాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో ఎంత భూమి అందుబాటులో ఉందన్న దానిపై రెండు నెలల క్రితం అధికారులు ఓ సర్వే నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)తో పాటు జిల్లా పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 11వేల ఎకరాలను గుర్తించారు. అయితే, అందులో 3వేల ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు ఉపయుక్తంగా ఉంటాయని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాల్సి వస్తే ఈ భూముల్లో టీఎస్ఐఐసీ మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అంటే రోడ్డు సౌకర్యం, కరెంటు, ఇతర మౌలిక అవసరాలను సమకూరుస్తుంది. ఆ తర్వాత పరిశ్రమల శాఖ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించి ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తుంది. ఈ పార్కులన్నింటినీ కలిపి ఇండస్ట్రియల్ కారిడార్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మూడేళ్లు పడుతుందని ప్రాథమిక సమాచారం.