
వీడిన పసికందు కిడ్నాప్ మిస్టరీ
కన్న కొడుకును బావిలో వేసి ఆపై కిడ్నాప్ డ్రామా..
భర్తతో ఉండటం ఇష్టం లేకనే ఘాతుకం
వివరాలు వెల్లడించిన సీఐ శ్రీనివాస్
దుబ్బాక(మెదక్): మావనత్వం మంటగలిసింది.. నవమాసాలు మోసి.. పేగు తెంచుకొని పుట్టిన రెండు మాసాల పసికందును ఆ కర్కశ తల్లి బావిలో వేసి కడతేర్చింది.. ఆపై తన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారంటూ డ్రామాకు తెరలేపింది.. అనుమానం వచ్చిన పోలీసులు ఆ కర్కశ తల్లిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే బావిలో వేసి చంపానంటూ ఒప్పుకుంది. ఈ అమానుషమైన ఘటనకు సంబంధించి శుక్రవారం దుబ్బాక సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. సిద్దిపేట మండలం పుల్లూరుకు చెందిన రామగల శ్రీమాన్, నంగునూర్ మండలం నర్మెట్టకు చెందిన కవిత మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసకున్నారు. వీరికి రెండు నెలల కిందట కుమారుడు పుట్టడటంతో దీక్షిత్ కుమార్ పేరు పెట్టారు.
భర్త శ్రీమాన్ దొంగతనం కేసుల్లో రెండు సార్లు జైల్‌కు వెళ్లడం.. తనను సరిగ్గా చూసుకోకుండా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ రావడంతోపాటు తల్లిదండ్రులకు దూరం కావడంతో కవిత కొద్ది రోజులుగా మానసికంగా కుంగిపోతూ వస్తుంది. భర్తతో ఉండటం ఇష్టం లేక కవిత ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. పది రోజుల కిందట అత్తగారిల్లు పుల్లూరులో గొడవపడి శ్రీమాన్ అమ్మమ్మ గారింటికి దుబ్బాక మండలం అప్పనపల్లికి వచ్చారు. శ్రీమాన్ 17వ తేదిన పని నిమిత్తం రుద్రారం గ్రామానికి వెళ్లి అక్కడే ఉన్నాడు. భర్తతో ఉండటం ఇష్టం లేక ఎలాగైన వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు రెండు నెలల పసికందు దీక్షిత్ అడ్డుగా ఉన్నాడని భావించి ఓ పథకాన్ని వేసింది.
కిడ్నాప్ డ్రామా..
ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటల సమయంలో దీక్షిత్‌ను బావిలో పడేసింది. ఏం తెలియనట్లుగా ఇద్దరు వ్యక్తులు వచ్చి తన బిడ్డను ఎత్తుకెళ్లారంటూ కిడ్నాప్ డ్రామా ఆడి తన భర్తతో కలిసి బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె మాటలు, ప్రవర్తన పట్ల అనుమానం వచ్చి కవితను అదుపులోకి తీసుకొని విచారించగా తనకు భర్తతో ఉండటం ఇష్టం లేకనే పసికందును బావిలో వేసినట్లు తెలపడంతో గురువారం బావిలో గాలించి పసికందు మృతదేహాన్ని వెలికితీసినట్లు సీఐ తెలిపారు. ఈ వ్యవహారంలో శ్రీమాన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కవితను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.